This blog is a Licensed work !

Tuesday 16 February 2010

కింగ్ కోడి - The hen with the Muscle !

క్కొ.. క్కొ.. క్కొ.. క్కోక్కొ.. కొ. క్కొ.. క్కొ..

అవును లెండి మీ మనుషులకి మా భాష ఇలాగే ఉంటుంది. ఎప్పుడైనా మనసు పెట్టి కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తే కదా తెలిసేది, మాది క్కొ..క్కొ.. భాష కాదు కలల భాష అని.

నా పేరు కోడి మల్లన్న. మాది పాడేరు. ఆల్లూరి సీతారామ రాజు పుట్టిన అడవిలో పుట్టిన నాటు కోడిని. అల్లూరి వీరత్వాన్ని మా బామ్మ కోడి అచ్చమ్మ ఇరవై నాలుగ్గంటలూ చెబుతూ ఉండేది. అందుకే నాకు తెల్ల దొరల్లన్నా తెల్ల కొంగలన్నా చిరాకు. ఒక సారి మా ఊరిలోకి తెల్ల దొర ఒకడు వచ్చాడు వచ్చి నా ఫొతో తీసుకోడానికి దగ్గరకి వచ్చాడు.
"జాయ్ సీతారామ రాజు " అని వాడి మీదకి దుంకాను, వాడు వెనక్కి పరిగెడితే వాడి ఎలాస్టిక్కు నిక్కరు లాగేసాను.
నా ఆనందానికి అవధుల్లేవు, ఒక తెల్ల దొరని బట్టల్లేకుండా నడి రోడ్డు మీద పరిగెట్టించాను. క్క క్క క్క కా....

ఆ రోజు మా ఊరిలో నాకు పాడేరు పందెం కోడి అని బిరుదు ఇచ్చారు.

నాకు ఉండే పని ఈ ప్రపంచం మొత్తంలో ఎవరికీ ఉండదు. సంవత్సరం మొత్తం బొక్కటమే నా పని. వెయ్యించిన జీడిపప్పు నా దైనిక ఆహారం. అప్పుడప్పుడు నా కోసం నా యజమాని వీరన్న పస్తులుంటాడు. కానీ నాకు జీడిపప్పు మాత్రం పెట్టకుండా ఉండడు. నేను పెంచుతున్న కండ మా పడేరులో అతి పెద్ద చికెన్ షాపు అయిన దుర్గమ్మ చికెన్ సెంటర్లో కూడా దొరకదు. ఇప్పటిదాకా నన్ను ఓడించడానికి నర్సీపట్నం, రాజుపాలెం, ముత్యాలమ్మపాలెం, సబ్బవరం, కొత్త వలస, ఎస్.కోట, రాజాం నుండి పందెం కోళ్ళు వచ్చి ఒడిపొయాయి. నా తల మూడు లక్షలు పలుకుతుంది. ఆ డబ్బు కోసం మీరు సాఫ్టువేరు కంపనీలలో ఎన్ని గంటలు పనిచేస్తారో... క్క క్క క్క... మిమ్మల్ని చూస్తే జాలేస్తుంది !

నా పెళ్ళాం పేరు కోడి దమయంతి. నెను రోజు రోజుకీ బేవార్సుగా ఆడకోడులతో ఎక్కువ తిరుగుతున్నానని మా ఊరొళ్ళు నాకు దమయంతికి ఇచ్చి పెళ్ళి చేసారు. దమయంతి భలే చలాకీగా ఉంటుంది గుక్క ఆపకుండా పావుగంట సేపు పాట పాడగలదు. అందుకే దానికి పొద్దున్నే అందరినీ లేపే పని అప్పజెప్పారు ! నాకు ఎంత బలమో దమయంతికి అంత ఓపిక, తూ-చ తప్పకుండా రెండు రోజులకి ఒక గుడ్డు పెట్టెస్తుంది.

నా శత్రువు కోడి పెదబాబు. పెదబాబు బాబు కోడి కనకయ్య నా తండ్రి కోడి కృష్ణుడుని సంక్రాంతి రోజు చంపేసాడు. నా అమ్మ అదే రోజు నన్ను కనింది, "కృష్ణుడు మళ్ళీ పుట్టాడు రా" అని మా కుటుంబమంతా, శోక సముద్రం నుండి అమృతం వచ్చినట్టు, నన్ను చూసి సంబరం చేసుకున్నారు.

కోడి పెదబాబుని రెండు మూడు సార్లు కలిసాను, వాడి కళ్ళు పొగరుగా ఉంటాయి, వాడి రెక్కలు నా కన్నా రంగుగా ఉంటాయి. అయితేనేంటి, రక్కలు కాదు బొక్కలు ముఖ్యం. ఒక సారి పోటీ కూడా జరిగింది మా ఇద్దరికీ, కానీ ఆ పొటీలో పెదబాబు పీకని చికెన్ సెంటరుకి అమ్మకానికి పెట్టెద్దామనుకున్నా. మధ్యలో ఎవడో ' పోలిసులు పోలిసులు ' అని అరిస్తే పీక నరికెద్దామని కాలు ఎత్తబోయేలోపు నన్ను మా యజమాని లాక్కెళ్ళిపోయాడు. దొరుకుతావు పెదబాబు ఎదో ఒక రోజు దొరుకుతావు.

నిజానికి పెదబాబు నాన్న కనకయ్య అని నాకు చాలా లేటుగా తెలిసింది. కనకయ్య ఇప్పుడు సివరాఖరి జీవితం గడుపుతున్నాదు.

మా అమ్మ కోడి దురగమ్మ ఈ విషయం లేటుగా చెప్పింది, చెప్పిన కొద్ది రోజులకి పాము కాటు వల్ల చనిపోయింది. దుర్గమ్మ నా ప్రాణం లాంటిది, నేను పుట్టిన మొదటి క్షణం దుర్గమ్మ ఒదిలో నుండే వచ్చాను. అమ్మ పోయాక నాకు చివరి చూపులు కూడా దక్కలేదు. నేను మర్చిపోలేని రోజు అది, దమయంతి గుడ్డు పెట్టని ఏకైక రోజు అది. కోళ్ళకే గనుక ఒక స్వర్గం అంటూ ఉంతే దుర్గమ్మ కి రాజ వైభోగం ఇవ్వమని దెవుణ్ణి ప్రార్థించాను.


ఇంకొక వారంలో సంక్రాంతి.
ఈ సంక్రాంతికి పెదబాబుని చంపితే వాడి నాన్న కనకయ్య కుళ్ళి కుళ్ళి ఏడవటం నా పగని చల్లారుస్తుంది.

వీరయ్య కొడుకు రాంబాబు కరాటే నేర్చుకుంటున్నాడు. ఒక సారి నా దగ్గరకు వచ్చి కోడి కరాటే నేర్పించాడు, ఖాతాలూ, బ్లాక్లూ, కిక్క్లూ ఇలా కరాటేలో వివిధ విన్యాసాలు భలే నేర్పించాడు. నేను రెక్కలతో గాల్లో ఎగిరి flying కిక్కు చేసాను. అది చూసి రాంబాబు కూడా ఎగిరి జారి పడ్డాడు, వాడి చెయ్యి విరిగింది. వీరయ్య నా దగ్గరకి వచ్చి , నేను గానీ గెలవకపొతే జీడిపప్పు పెట్టడం మానెస్తా అని బెదిరించాడు.

"మనుషులు డబ్బు కోసం బ్రతుకుతారు, భక్తులు దేవుని కోసం బ్రతుకుతారు, నేను పగ తీర్చుకోవడం కోసం బ్రతుకుతాను" అని చెబుదామనుకున్నా. కానీ క్కొ క్కొ తప్ప ఏమైనా వినిపిస్తే కదా, "కళ్ళల్లోకి చూసి మాట్లాడు వీరయ్యా...friendly గా ఉండు !"

సంక్రాంతి రోజు రానే వచ్చింది, అందరూ చుట్టాలని పలకరించుకుంటూ, విందు భోజనాలు చేస్తూ, ఆటలు, పాటలు, గొబ్బెమ్మలూ, ముగ్గులు వేస్తున్న పదహారణాల ఆడపిల్లల బుగ్గల్లో సిగ్గులు... అబ్బా ఎంత చూడముచ్చటగా ఉందో ఆ రోజు.

దమయంతి నా రెక్కలు దువ్వుతూంది, నేను బయలుదేరడానికి సిద్ధంగా ఉన్నాను..

"సరే ఆ పెదబాబు పీక కోసి వస్తా"
"నేనూ వస్తాను"
"వద్దు.....రక్తపాతం నువ్వు కళ్ళ జూడలేవు"

రణరంగం సిద్ధమయ్యింది

"చుట్టుపక్కల అన్ని ఊర్లలో ఎదురు లేని సైనికుడిగా ఎదిగి, అల్లూరి పౌరుషాన్ని పునికిపుచ్చుకుని, ఈ ఏజెన్సీ లోనే తిరుగులేని రారాజుగా ఉన్న పడేరు పందెం కోడి మల్లన్న." అన్న వెంటనే రంగంలోకి దింపారు. అందరూ ఈలలు, గోలలు. దగ్గరకి ఎవరైనా వస్తే వాడి మొహం రక్కేసే ఆవేశంలో ఉన్నాను. అది గమనిస్తున్న వీరయ్య మళ్ళి కోర్టు కేసులు ఎందుకులే అని అందరినీ దూరంగా ఉంచుతున్నాడు (అప్పుదెప్పుదో బాలకృష్ణ ఇలాగే ఒక కోడి కోసం కోర్టుకు వెళ్ళాడని మా బామ్మ చెప్పింది లెండి).

పెదబాబు కనిపిస్తున్నాడు దూరంలో. నాకు నా నాన్న చావు గుర్తొస్తూంది. రక్తం ఉడికిపోతూంది, ఇంకొంత సేపు ఉంటే చికెన్ ఫ్రై అయిపోతానేమో అనేలా ఉడుకుతూంది. పెదబాబుకి కూడా ఎవో బిరుదులు చెబుతున్నారు, నాకేమీ వినిపించట్లేదు. పెదబాబు రంగంలోకి దిగాడు.

పెదబాబు కళ్ళని గమనిస్తున్నా. ముందు వాడే ఎగిరాడు. నా ముక్కుకి చిన్న గాటు పడింది. తర్వాత నేను ఎగిరాను, వాడు కూడా ఎగిరదు, వాడి కత్తి నా కత్తి తగిలి ఇద్దరం దూరంగా పడ్డాము. మా వాళ్ళు మా ఇద్దరినీ పట్టుకొని దగ్గరగా పెట్టారు. ఈలాగ పావుగంట సాగింది, ఇద్దరం సగం ఓపిక కోల్పోయాం.
అప్పుడు మా వీరన్న నాకు తేనెలో ముంచిన జీడిపప్పు తినిపించాడు. నా కళ్ళల్లో శక్తి ప్రవహించింది. రాంబాబు నేర్పించిన కోడి కరాటే పెదబాబు మీద ప్రయోగించాను. ఎగిరెగిరి తన్నాను. వాడి కాలు కోసాను. క్క క్క క్క క్క కా.. మల్లన్న మల్లన్న అని జనాలు అరుపులు... నా కళ్ళల్లొ ఆనందం చూడాలి ! (సాగర సంగమం లో కమల హాసన్ చివర్లో ఇలాగే ఏడ్చాడు లెండి !)

ఇంక సివరాకరి కోడి కరాటే మూవ్... పెదబాబు ఇంక లేవలేకపోతున్నాడు. సైకిల్ కిక్కు ఇవ్వడానికి కాలు దువ్వాను, పెదబాబు గట్టిగా అరిచాడు....

"ఒరేయ్ నీ అమ్మని చంపింది పాము కాదురా వీరన్న రా...నీ అమ్మని వండుకొని తినేసారు రా క్క క్క క్క కా"....

ఎదో బాంబు పేలినట్టు అనిపించిండి

అది విని నా కిక్కు సగంలోనే ఆగిపోయింది. అంతా నిశబ్దం.
వీరన్న కేసి చూసాను, చేతిలో జీడిపప్పు ఉంది.


నాకు మాట రావట్లేదు, ఏడుపు కూడ రావత్లేదు, నా శత్రువు ఎవరో నాకు గోచరించట్లేదు. శిలలాగ ఒక నిముషం ఉండిపోయా


'ఎంత మోసం చెసావు వీరన్న, ఇంత కాలం నన్ను మేపుతూంది నీ డబ్బుల కోసమా నా పని అయిపోతే వండుకొని తినేస్తావా...అన్యాయంగా నా అమ్మని చంపేసావు కద రా...


పెదబాబు పుంజుకొనేలా ఉన్నాడు. వీరన్న కళ్ళల్లో తొందర కొట్టొచ్చినట్టు కనిపించింది. అది చూసి కోడి మల్లన్నకి వైరాగ్యపు ఆనందం వేసింది.

నీకు శిక్ష వెయ్యాలి వీరన్న... నువ్వు కుమిలి కుమిలి ఏడ్చే శిక్ష వెయ్యాలి... ఔను నేను ఓడిపోవాలి !... ఓడిప్......'

ఇంక మాటల్లేవు... కోడి మల్లన్నని కోడి పెదబాబు చంపేసింది ..ఆ రాత్రికి కోడి పెదబాబు గాయాలతో చనిపోయాడు, కోడి కనకయ్య కూడా కొడుకు చనిపోయాడనే బాధతో చనిపోయారు.

వీరస్వర్గం పొందిన కోడి మల్లన్నని వండకుండా వీరయ్య సమాధి చేసి పాతిపెట్టాడు.

పాడేరు పందెం కోడి ఒక ఊతపదంగా మారిపోయింది.


Wednesday 3 February 2010

లల్లీ - అమెరికా - ప్రేమ

ముందు మాట :
ఇది మునుపటి కథల కంటే పెద్ద కథ . అందువలన దీనికి interval పెట్టి రెండు భాగాలుగా చెయ్యబడింది.
school పిల్లల తత్వాన్ని చూపించటం ఈ కథలో మొదటి భాగం ముఖ్య ఉర్దేశం.


తొందర తొందరగా చదివెద్దాం అనే ఉర్దెశం ఉంటే మరి కొంచెం సమయం తీసుకోండి.


-----------


జ్ఞానోదయ పబ్లిక్ స్కూల్ లో మద్యాహ్నం పావుతక్కువ పన్నెండు దాటింది. 9th B విద్యార్థులు టిఫిన్ బాక్స్ లు ఓపెన్ చెయ్యడానికి ఎదురు చూస్తున్నారు. హిందీ టీచర్ మాత్రం ఆవిడ పాఠంలో లీనమై ఉంది...


""काल करे सो आज कर"
""काल करे सो आज कर"

పిల్లలు పద్యాన్ని అప్పజెబుతున్నారు

"आज करे सो अब"
"आज करे सो अब"


చందూ గాడు టిఫిన్ బాక్స్ తీసాడు. ఒక మూతలో అప్పడాలు ఉన్నాయి, మూత తీసి చూసాడు, సాంబారన్నం ఉంది. చందూ గాడికి నోరు ఆగట్లేదు. పక్కన ఉన్న దినేష్ గాడు బాక్స్ మీద చెయ్యి వేసాడు, చందుగాడు చెయ్యి పట్టుకున్నాడు. ఇద్దరూ కొట్టుకుంటున్నారు


""काल करे सो आज कर"
""काल करे सो आज कर"


"ఎవడురా కారేజీ ఓపెన్ చేసింది ?"

దినేష్, చందూ ఒక్క సారి నిఠారుగా కూర్చున్నారు.

"ఎవడైనా తింటున్నట్టు కనిపిస్తే మూతి వాయించేస్తా"


"आज करे सो अब"
"आज करे सो अब"

ఇంతలో చందూని వెనక నుండి ఎవరో తట్టారు. చందూ వెనక్కి తిరిగాడు, తట్టింది లలిత. చందూ గాడి మొహం వెలిగిపోయింది. వాడికి లలితంటే చాలా ఇష్టం. వాడి భాషలో అది 'ప్రేమ'
లలిత ఏదో చీటీ ఇచ్చింది. "ఇది సుమిత్రకి పాస్ చెయ్యవా !". చందూ గాడు నవ్వుతు తీసుకున్నాడు.


టీచర్ : "చందూ sit straight"


చందూ ముందుకు తిరిగాడు. దినేష్ గాడు ఆ చీటీ తీస్కున్నాడు.

చందూ : "ఒరేయ్ లలిత సుమిత్రకి ఇమ్మంది"
దినేష్ ఓపెన్ చెయ్యబోయాడు, చందుగాడు అడ్డుకున్నాడు
దినేష్ : "ఏముంది ఇందులో"
చందూ : "ఏమో.. పక్కోళ్ళ చీటీలు చూడకూడదు"
దినేష్ : "ఎ పోరా..."

అని ఓపెన్ చేసాడు.. ఏవో పిచ్చి symbols ఉన్నాయి...

లలిత దినేష్ ని కొట్టింది : "సుమిత్రకి ఇవ్వురా.."
దినేష్ : "ఏంటిది కోతుల బాష"


ఆ జోకుకి చందూ, లలిత శబ్దం బయటికి రాకుండా నవ్వుకున్నారు


లలిత : "కోతి భాష కాదు... కొత్త లాంగ్వేజ్ మేము పెట్టుకున్నాం"
చందూ : "అయితే మాకు నేర్పించు"


టీచర్ : "దినేష్ అండ్ చందూ.stand up on the bench"


ఇద్దరూ అమాయకంగా మొహం పెట్టారు.బెంచ్ మీద నిలబడ్డారు.
దినేష్ : "లలిత నాకు కూడా నేర్పించు"
లలిత : "ష్..."

దినేష్ సుమిత్రకి పేపర్ విసిరేసాడు. అందులో ఏముందో వాళ్ళకే తెలియాలి. ఇంకో 5 ని||లులో గంట మోగింది.

--------------


"అరేయ్ చందుగాడు అప్పడాలు తెచ్చాడు"..గుంపులో ఎవడో అరిచాడు

చందుగాడు టిఫిన్ బాక్స్ పట్టుకొని పరిగెత్తాడు. వాడి వెంట ఇంకో ఇద్దరు పరిగెత్తారు. దినేష్ గాడు ఆ ఇద్దరిలో ఒకడిని పట్టుకున్నాడు, రెండో వాడి నుండి చందూ గాడు పారిపోయాడు.
చందూ, దినేష్ ఆ గ్రౌండ్లో మిగితా వాళ్లకి దూరంగా తిన్నారు.


దినేష్ : "అరేయ్ నీకొక secret చెప్తా "
చందూ :"ఏంటి ?"
దినేష్ : "నాకొక అప్పడం ఇవ్వు"
చందూ : "ముందు secret చెప్పు బే"
దినేష్ : "గాడ్ ప్రామిస్ నేను secret కచ్చితంగా చెప్తాను"
చందూ గాడు అప్పడం ఇచ్చాడు
దినేష్ : "ఎవరికీ చెప్పద్దు"
చందూ : "చెప్పను"
దినేష్ : "మన క్లాసులో లలితని ఒకడు లవ్ చేస్తున్నాడు"
చందూ గాడి గుండె ఆగినంత పనయ్యింది.


'ఈ విషయం వీడికెలా తెలిసింది క్లాసులో నేను లలిత కేసి చూడటం చూసేసాడా'


"ఎవడాడు ?"

దినేష్ : "వాడి పేరు h తో end అవుతుంది D తో start అవుతుంది"

చందూ గాడు క్లాస్మేట్స్ గురించి ఆలోచిస్తున్నాడు. నలభై మంది ఉన్నారు రోల్ నెంబర్ కూడా గుర్తులేదు.

'దీపక్ కాదు, ధనంజయ్ కాదు ఇంకెవరూ'

దినేష్ గాడు బాక్స్ సర్దుకొని వెళ్ళిపోతున్నాడు

చందూ : "ఒరేయ్ దినేష్ ఎవడురా"
దినేష్ : "నీ యబ్బ ఇప్పుడే చెప్పావ్ కదా" అని పరిగెత్తాడు

చందూ గాడు ఒక్క సారి ‘ఆహ్’ అని నోటి మీద చెయ్యి వేసుకున్నాడు. వాడి ఫ్రెండే వాడికి కాంపిటీషన్ ఆ అనుకున్నాడు.
ఇంతకీ తను లవ్ చేస్తూందో లేదో అనే టెన్షన్. సన్నని గోడ మీద నడుస్తున్నట్టు ఉంది తనకి.

--------------------------------------------------------------------------


సాయంత్రం పీ.టీ. క్లాసు. అందరూ క్రికెట్ ఆడుతున్నారు.


చందూ గాడి టీం లాస్ట్ బాల్ సిక్స్ కొట్టాలనీ తను అది సాధించాలని కలలు కంటూ ఫీల్డింగు చేస్తున్నాడు. ఎందుకంటే పక్కనే లలిత థ్రో బాల్ ఆడుతూంది !


ఎట్టకేలకు తన బాట్టింగ్ వచ్చింది.

దినేష్ గాడు బౌలింగ్, లాస్ట్ బాల్ రెండు పరుగులు తీయాలి. అందరూ ఆసక్తిగా చోస్తున్నారు. దినేష్ని ఓడిస్తే తన లవ్ సక్సెస్ అని అనుకున్నాడు. దినేష్ బౌలింగ్ చాలా స్పీడ్ వస్తుంది. చందూ బాల్ ని పూర్తిగా చూడకుండా గట్టిగా కొట్టాడు. మొతానికి సింగిల్ తీసి డ్రా ఐంది.


Next period కి క్లాసు లో కూర్చున్నారు. లలిత చందూని తట్టి

“బా ఆడావ్ తెల్సా. నాకు చాలా టెన్షన్ వేసింది. అసలకే దినేష్ బౌలింగ్ కదా !”

ముందు చందు గాల్లో తేలాడు. మళ్లీ దినేష్ పేరు విని దిగొచ్చాడు . కొంపదీసి దినేష్ ని లవ్ చేస్తూండ అని డౌట్ వచ్చింది !


లవ్ చేయకుండా కూడా మనుషులు బ్రతగ్గలరనే విషయాన్ని వాళ్లెప్పుడో మర్చిపోయారనుకుంట, సినిమా ప్రభావం అంటే ఇదే !

------------------------------------------------------------------------


ఇంతలో బయట కారిడార్లో ఏదో గొడవ అవుతూంది. వెళ్లి చూసాడు. దినేష్ గాడు సుదీప్ గాడు కొట్టుకుంటున్నారు. సుదీప్ ని మెట్ల మీదకి గట్టిగా తోసేసాడు. హీరో అయిపోతున్నాడని చాలా ఫీల్ అయిపోయాడు చందూ.


“Teacher is coming , teacher is coming”…


అర సెకండ్లో ఆ కారిడార్ ఖాళీ అయిపొయింది. దినేష్, చందూ గాడు కూర్చున్నారు. డెస్క్ లో స్కూల్ బాగ్ నుండి ఒక పేపర్ తీసి చింపి చేతి మీద పడిన చిన్న దెబ్బ తుడుచుకున్తున్నాడు దినేష్.

“ఎరా దినేష్ ఏమైంది ?”, ముందు బెంచ్ సుమిత్ర అడిగింది.

“ఏం లేదు నాది చింపిరి జుట్టు అంట, అందుకే కొట్టాను”. దినేష్ కి ముందు నుండి సుదీప్ తో గొడవే.

-----------------------------------------------------------------


లాస్ట్ పీరియడ్ అయిపొయింది. అందరూ స్కూల్ బస్సు ఎక్కారు. దినేష్, చందూ,రాజేష్ క్రికెట్ కార్డ్లు ఆడుకుంటున్నారు. చందుకి ఆ రోజు చాలా వింత రోజు. అనుకోని ఒక పెద్ద రహస్యం బయట పడింది. గొడవ జరిగింది, లలిత తనని పొగిడింది .. ఆ ఆలోచనలో ఉన్నాడు.

“అరేయ్ ఇంకో secret చెప్పనా ?”, దినేష్ మళ్లీ కెలికాడు

“చెప్పు”,

“ఈ రోజు సుదీప్ ని ఎందుక్కోట్టానో తెలుసా”

“నీ జుట్టు బాగోలేదన్నాని?”


“కాదు గ్రౌండ్లో వాడు లలితకి flying kiss ఇచ్చాడు”

చందూ గాడు షాక్ అయ్యాడు. సుదీప్ గాడంటే కోపం వచ్చింది. కానీ తన రహస్యం బయట పడిపోతుందని భయమేసి ఇంకేం మాట్లాడకుండా ‘హా’ అన్నాడు.రాజేష్ గాడు పైకి చూసాడు.


“ఏంటి లలిత గురించి చెప్పాడా ?”

"నీక్కూడా తెలుసా ?"

“ఇప్పటికీ పది మందికి చెప్పాడు ఎవరికీ చెప్పొద్దని !”


దినేష్ గాడి సిగ్గుకు అంతులేదు..


‘flying kissలు, affair లు వామ్మో'




Final exams వచ్చేసాయి. సగం టైం అంతా లలితే గుర్తొస్తూంది. ఇంకో వైపు చదవాలి కూడా. ప్రతీ పరీక్ష అయ్యాక లలిత కోసం చూస్తూ ఉంటాడు. తను అలాగే సుమిత్రతో కలిసి వెళ్ళిపోతుంది. అప్పుడప్పుడు దినేష్ గాడు లలితతో ఓ తెగ మాట్లాడతాడు. చాల జెలసీ కలిగేది చందుకి !

రాత్రి పడుకునేటప్పుడు తనూ, లలితా ఏదో ఉద్యానవనంలో విహారం చేస్తున్నట్టు పగటి కలలు కంటాడు.

తెలుగు exam నాడు లలితా చందు అమ్మలక్కల కబుర్లు చెప్పుకున్నారు. మాటల్లో తనకి ఇంగ్లీష్ workbook లో చివరి లెసను రాస్తే చాక్లెట్ ఇస్తానని చెప్పాడు. డబ్బులు అడిగితే ఇవ్వరని అమ్మ పర్సులో నుండి పది రూపాయిలు కొట్టేసాడు. మళ్ళీ ఎప్పుడూ అలా చెయ్యనని ఒట్టేస్కున్నాడు కూడా.


------------------------------


intermission


------------------------------



చివరిది ఎకానామిక్స్ exam, తనకి ఇష్టమైన సబ్జెక్టు. ఆ రోజు రోల్ నెంబర్ సీటింగ్ మార్చారు. సరిగ్గా తన పక్క బెంచ్లో లలిత ఉంది. చందు తెగ సంబరపడిపోయాడు.


పరీక్ష start అయ్యింది. తానో పెద్ద సినిమా హీరో అనే కాన్ఫిడెన్సు తో exam రాసేస్తున్నాడు. ఆ పేపర్లో పడిపోయి గంట అయింది, 75% పేపర్ అయిపొయింది. అకస్మాత్తుగా తలెత్తాడు. పక్కన లలిత తల వాల్చి పడుకొని ఉంది ! పేపర్ కట్టేసి పక్కన పెట్టేసి ఉంది.


టీచర్ తన వెనక ఉండటం చూసి లలితని ఎరేసేర్ తో కొట్టాడు. లలిత తన కేసి చూసింది. ఇక అంటా సైగలే.


“ఏం అయింది ?”

“ఏం రాదు”


వెనక టీచర్ కేసి చూసాడు. టీచర్ తనని చూడట్లేదు. లలిత బెంచ్ మీద తన పేపర్ పెట్టేసాడు.

మల్లి సైగలు

“వద్దు వద్దు”

“నో ప్రాబ్లం నీ పేపర్ కింద నా పేపర్ పెట్టు ఎం అవ్వదు”

“మరి ఇవ్వటం ఎలాగా”

“నేను తీస్కుంటా don’t worry”


నిజానికి తను ఎప్పుడు కాపీయే కొట్టలేదు


లలిత ఇంకో గంట సేపు బాగా రాసేసింది. టీచర్ చూడకపోవడం చూసి చందు మెరుపు వేగంతో బెంచ్ మీద తన పేపర్ని లాగేస్కున్నాడు. ఇంకో అరగంట సేపు ముక్కు నోరు చెవి సైగలతో కాపీ చేస్కున్నారు !



పరీక్ష అయిపొయింది.

లలిత చందు దగ్గరకి వచ్చింది, చందు నవ్వుతున్నాడు. లలిత నీరసంగా ఉంది.

“నిన్నంతా 104 జ్వరం. నాకు ఎకనామిక్స్ అస్సలు రాదు. నువ్వు చాలా హెల్ప్ చేసావు తెల్సా. లేకపోతే ఫెయిల్ అయిపోదును”. అంటూ ఎడిచేసింది

ఆ క్షణం తను హీరో అయిపోయడనే ఫీలింగ్ లేదు, లలితకి జ్వరం వచ్చిందనే మాట తర్వాత తనకి ఏమి వినిపించలేదు !

చందు తన జేబులో నుండి మంచ్ తీసి లలితకి ఇచ్చాడు. లలిత ఏడుస్తూ నవ్వింది.


“థాంక్యూ చందు. హ్యాపీ సమ్మర్ హాలిడేస్. ఎక్కడికైనా వెళ్తున్నావా ?”


‘నువ్వు లేని హాలిడేస్ ఎలా గడుస్తాయో ఏంటో !’


“అవును లలిత తిరుపతి వెళ్తున్నాము. నువ్వు అన్నీ బాగా పాస్ అవ్వాలని దేవునికి చెప్తానులే ”

---------------


చందుకి సమ్మర్ ఎలా గడిచిందంటే. ఆఖరికి తిరుపతి దర్శనంలో కూడా ఆ లైన్ లో లలిత ఉంటుందేమో అని వెతుక్కున్నాడు !


---------------

స్కూలు మళ్ళీ మొదలయ్యింది. అందరూ కొత్తగా కలిసారు. క్లాసు టీచర్ మారింది. తెలుగు మాస్టర్ క్లాసు కి వచ్చి అందరికీ మొదటి రోజు కదా class లేదని ఏదో ఒకటి చేసుకోమన్నారు.

“అరేయ్ చందు, లలిత ఏదిర ?”

దినేష్ కూడా అదే టెన్షన్ లో ఉన్నాడు... చందు లాగ

“నాకేం తెలుసు ?”

ఇంతలో సుమిత్ర వాళ్ళకేసి తిరిగింది

“హే ఈ రోజు ఐదుగురు కొత్త స్టూడెంట్స్ వచ్చారు”

“మన వాళ్ళు కూడా చాలా మంది వెళ్ళిపోయారు, రమేష్, వీణ, లలిత”

“రమేష్ వీణ రేపు వస్తారు.


లలిత వాళ్ళ నాన్నకి అమెరికా ట్రాన్స్ఫరు అయిపొయింది తను కూడా చక్కా అమెరికా వెళ్ళిపోయింది !”


ఇంకంతా నిశబ్దం.... చందు మనసులో !



పదహారు ఏళ్ళు పోయాక తానా సభ, US లో, anchor మాట్లాడుతున్నాడు.

“ఒక సారి మా అమెరికా ఫ్రెండ్ తో - తెలుగు వాళ్ళ మీద నీ opinion ఏంటి - అని అడిగాను. వాడు ఇలా చెప్పాడు, తెలుగు వాళ్ళు మంది ఎక్కువ మేటర్ కొంచెం తక్కువ అని. నాకు చాలా కోపం వచ్చింది. నువ్వు పొరబడుతున్నావు, తెలుగు వాళ్ళకి తెలివి అమోఘం, మిగితా వాళ్ళతో పోలిస్తే ప్రాచూర్యం తక్కువ అని అన్నాను. తను ఇలా అన్నాడు, తమిళం వాళ్ళు చాలా పెద్ద పెద్ద అవార్డులు రివార్డులు పొందారు తెలుగు వాళ్ళకి అవి తక్కువ అని.


ఆ మరుసటి రోజు తనకి పేపర్ తెరచి చూపించాను. తన మాట తప్పు అని నిరూపించిన ఒక తెలుగు యువకుని విజయం అది. నేను మాట్లాడుతున్నది దేని గురించో మీకు తెలిసే ఉంటుంది. నోబెల్ ప్రైజ్ విన్నర్ చంద్రశేఖర్ గురించి


చంద్ర శేఖర్ అలియాస్ చందు స్టేజి ఎక్కి చక్కటి చిక్కటి ఉపన్యాసం ఇచ్చాడు.


అందరూ విందు చేస్తున్నారు. తనతో చాలా మంది మాట్లాడుతున్నారు. తన వయసు 30 అవడంతో పెళ్లి విషయాలు చాలా మంది ఆరా తీస్తున్నారు.

సంబారు వేస్కోడానికి వెళ్ళాడు. గరిటె తీస్కోబోతూంటే ఇంకొక చెయ్యి కూడా వచ్చింది.

“మీరేస్కోంది”, అన్నాడు చందు

“సరే”

చందు మోహంలో తేడా వచ్చింది. ఆమె లలిత.


‘లలిత….. బాగున్నావా…… ఎం చేస్తున్నావ్ ? ఎలా ఉన్నావ్ ? నీ కోసమే నేను ఇంత దూరం వచ్చి ఇంత పేరు తెచ్చుకున్నది ! నీకొకటి తెలుసా.. నువ్వేమీ మారలేదు.. అవే కళ్ళు అదే అందం. నువ్వు చీరలో ఎంత బాగున్నావో... నన్ను ఒక్క క్షణం గుర్తు పట్టచ్చు కదా... నీకు పెళ్లయిపోయిందా పరవాలేదులే స్నేహితుడిలా అయినా నిన్ను చూసుకుంటా. ఒక్క సారి నన్ను గుర్తుపట్టు. ఏంటి నీకు ఆ పాత రోజులు గుర్తులేవా !'


తను సంబారు వేస్కుంది, వేసుకొని వెళ్ళిపోయింది. వెళ్లి దూరంగా కూర్చుంది.


అంతా విలాసవంతమైన గదిలో కూడా తనకి ఎక్కడా సంతోషం కానరాలేదు.


‘లలితకి అసలు నేను గుర్తున్నానో లేదో !’


తను కూడా కొద్దిగా దూరంలో కూర్చున్నాడు. సినీనటుడు బ్రహ్మానందం తన దగ్గరకి వచ్చాడు నోబెల్ ప్రైజ్ కి కంగ్రాట్స్ చెప్పాడు, చందుని పరధ్యానంలో ఉండటం చూసి నవ్వుతూ మాట్లాడకుండా వెళ్ళిపోయాడు. ఇప్పుడు లలిత కుర్చీ తిప్పుకొని కూర్చుంది. ధైర్యం చేస్కొని చందు దగ్గరకి వెళ్ళాడు,

“ఇక్కడ కూర్చోవచ్చా ?”


లలిత ఏడుస్తూంది


“ఏమైంది మీకు ?”


“నీతో మాట్లాడాలంటే భయమేస్తూంది”, అని తొందర తొందరగా బాగ్ లో నుండి మంచ్ తీసి ఇచ్చింది.


“లలితా నేనింకా గుర్తున్నానా !”


తను ఇంకా గట్టిగ ఏడిచింది..

"ఇది ఏడుపు కాదులే ఆనందభాష్పాలు అయినా మర్చిపోతే కదా మళ్లీ గుర్తు రావటానికి !”, అంది కళ్ళు తుడుచుకుంటూ.


చందు ఎం మాట్లాడలేదు


నీకు పెళ్లి కాలేదు కదా నన్ను పెళ్లి చేస్కో”,అని ఆ ఏడుపు గొంతుతో ఏదో ఆర్డర్ వేసినట్టు అక్కడ నుండి లేచి వెళ్ళిపోయింది !


తను భ్రమలో ఉన్నాడేమో అని ఒక సారి గిల్లుకున్నాడు. ఇంకా నమ్మకం కుదరక దగ్గరలో ఆడుకుంటున్న పిల్లాడి దగ్గర బంతి లాక్కున్నాడు. ఆ పిల్లాడు ఎడ్చాడు. ఇప్పుడు నమ్మకం కుదిరింది.


చంద్ర శేఖర్ కి నోబెల్ ప్రైజ్ వచ్చినప్పుడు కూడా అంత ఆనందం వెయ్యలేదు !