This blog is a Licensed work !

Wednesday 26 May 2010

ఇంటర్-మే-ఈడియట్

ప్రపంచంలో ప్రతీ వాడికీ తెలిసీ తెలియని వయసు అని ఒకటి ఉంటుంది. అప్పుడే అన్నీ సమకూర్చెస్తే తెలిసిన వయసులో కావలసినవన్నీ రాబట్టచ్చు అని పెద్దలు శకుని మామ రేంజ్ లో ప్లానులు వేస్తూ ఉంటారు. దానిని పసిగట్టారు గనుకనే తెలుగునాడులో ఇంటర్మీడియెట్ కళాశాలలకి కుంభవృష్టి లాగా లాభాలు వచ్చి పడ్డాయి. ఆ లాభాల బాటలో ఇటుకలేసిన ఒక కార్మికుడు గణేష్ !

చీమ పంచదార పాకం నాకడానికీ, దోమ మనిషి రక్తం తాగడానికీ, బ్లాక్ టిక్కెట్లు అమ్మే వాడు ఊరి చివరిన భూమి కొనడానికీ ఎలా ఆశిస్తాడో... ఇలాంటి సాధారణ చదువికుడు కూడా ఒక పెద్ద కాలేజీకి వెళ్ళడానికి అంతే ఆశిస్తాడనేది వాడికి తప్ప ఎవరికీ తెలియని రహస్యం ! అయితే వాడి పరీక్ష ముందు రోజు పక్కింటి సరోజాదేవి ఆంటీ ఎలాగైనా తన కొడుకు హరీష్ కి గణేష్ కంటే మంచి ర్యాంకు రావాలని భగవద్గీతా పారాయణం చేసింది. దానికి ముందు రోజు జ్యోతిష్యుణ్ణి పిలిపించి వెయ్యి రూపాయిలు ఇప్పించి మరీ తన కొడుకుకి మంచి ర్యాంకు వస్తుందని చెప్పించుకుంది.

ఏదేమైతేనేం సివరాకరికి వెలువడ్డాయి AIEEE ఫలితాలు. నిజానికి దానికి గంట ముందే న్యూస్ చానళ్ళలో చైతన్యా నారాయణా కాలేజీలు కీచురాళ్ళల్లాగా రాంకుల పారాయణం చెసాయి. అది చూసిన ఉద్వేగంలో, గణేష్ కి మంచి రాంకు రాకపోతే తనకి గుండెపోటు వస్తుందేమో అని భయపడ్డాడు వాళ్ళ నాన్న ! మొత్తానికి ఇంటర్నెట్టులో తన నంబరు ఇచ్చి...లోడు అవుతున్న పావుగంట సమయంలో విష్ణు సహస్రనామం చదివించారు ఇంట్లో వాళ్ళు.


ర్యాంకు వచ్చింది..

"గణేష్ పీ.
మీ ర్యాంకు...1001.... ప్రింట్ తీస్కోవాలనుకుంటే ఇక్కడ క్లిక్ చెయ్యండి !... "
అంతే రాసి ఉంది !

గణేష్ కి ఎమీ అనిపించట్లేదు...
"1001 మంచి ర్యాంకు నాన్నా !"

"అయ్యో..."

"ఎమైంది నాన్నా ?"

"సహస్రనామం చదివించడం వల్ల 1001 వచ్చింది ! అష్టోత్రం చదివించి ఉంటే 9 వద్దును !"

"అయ్యో !"

"ఇప్పుడు ఎమైంది నాన్నా ?"

"అసలు ఏమీ చదివించి ఉండకపోతే 1 వద్దును కదా"

లక్కీగా ఆ రోజు మద్యాహ్నం వంటలో ఉప్పు కారం తగ్గించి బీ.పీ.మాత్రల పొడిని అమ్మ వేసింది కాబట్టి సరిపోయింది, లేకపోతే గుండెపోటు గుమ్మడి లాగా గుండె పట్టుకుని ఉండేవారు గణేష్ నాన్న.
అయితే సరోజాదేవి ఆంటీ మాత్రం ఒక్కడు సినిమాలో బురదపూసుకున్న ప్రకాష్ రాజ్ లాగా ఎవరితోనూ మాట్లాడట్లేదు. ఎందుకు అని అడిగితే 'మౌనవ్రతం పాటిస్తున్నా' అని చెప్తోందంట !
రోజులు గడుస్తున్నాయి. కౌన్సిల్లింగ్ రోజులు దగ్గర పడుతున్నాయి.

గణేష్ రాత్రి టీవీ 9 చూస్తున్నాడు. నాన్న ఆఫీసు నుండి వచ్చాడు

"ఏం చేస్తున్నావురా గణేష్"

"వార్తలు చూస్తున్నా నాన్నా. లోక జ్ఞానం తెలుసుకుంటున్నా"

"మా బాబే.. బాగా చూడు"

నిజానికి అలా రోజూ రాత్రి ఎంటర్టైన్మెంట్ టునైట్ కోసం వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నాడు...అయితే ఇంతలో

ఫ్లాష్ న్యూస్ : "పద్ధెనిమిదేళ్ళ బాలునిపై తల్లి హత్యా ప్రయత్నం......విశాఖపట్నంలోని సీతమ్మపేటలో సరోజా దేవి అనే మహిళ...."
ఇంకా పూర్తిగా అవకుండానే కెవ్వుమని కేకపెట్టాడు గణేష్. పక్కింట్లోకి తొంగి చూస్తే అంతా హడావిడి. అసలు కథ ఏమిటనేది టీవీ 9 వాడికి కూడా అంతు చిక్కలేదు... అయితే ఆ రోజు పొద్దున్న సరోజా దేవి హరీష్ని నూతిలోకి తోసేసి తను కూడా దూకేసే ప్రయత్నం చేస్తూంటే ఎదురింటి శివబ్రహ్మం గారు చూసి పైకి లాగి పబ్లిసిటీ కోసం టీవీ 9 వాడిని పిలిపించారు... చావుబ్రతుకుల్లో ఉన్న ఇద్దరినీ టీవీ 9 వాళ్ళు "ఇప్పుడు మీరు ఎలా ఫీలవుతున్నారు" అని ప్రశ్నించగా... సరోజా దేవి లాగి పెట్టి కొట్టడంతో.... అది ఇంకా పెద్ద న్యూస్ అయ్యి 108 వాళ్ళు వచ్చి ఇద్దరినీ తీసుకొని వెళ్ళారు.

పక్కింటి స్పేరు తాళాలు వాళ్ళింట్లో ఉన్నాయని గుర్తొచ్చి గణేష్, హరీష్ ఇంట్లోకి వెళ్ళాడు. తన హాల్టికెట్టు నంబరు దొరికింది, వెళ్ళి హరీష్ ర్యాంకు నెట్టు లో చూసాడు. ..... 1002 ! అప్పుడర్థమయ్యింది..... ఆ అవమానం భరించలేక నూతిలోకి దూకి ఆత్మహత్య ప్రయత్నం ఎందుకు చేసారో

"సరేలే ఊరుకో... పరేషాన్ ఎందుకు" అని సర్ది చెబుదామని బ్రహ్మానందంలా ఆసుపత్రికి బయలుదేరాడు.

సరోజాదేవి ఆంటీ ఐ.సీ.యూ. లో ఉంది. హరీష్ కోలుకున్నాడు. బయట ఎన్ టీవీ వాడు "మీరు టీవీ 9 వాడిని చెప్పుతో కొట్టారా చేత్తో కొట్టారా" అని అడగడానికి, సరోజాదేవి ఎప్పుడు లేస్తుందా అని ఎదురు చూస్తున్నారు. హరీష్ రూముకి వెళ్ళాడు గణేష్.

"ఎలా ఉన్నావు హరీష్... ఎడారిలో ఎండిపోయిన కాకిలా అయిపోయావు తెలుసా", నోరు జారాడు గణేష్

"ఎందుకొచ్చవ్ ?", చేతిలో ఉన్న ఆపిల్ పండు లాక్కుంటూ అడిగాదు హరీష్

"ఊరికే.....ఇంతకీ కౌన్సిలింగుకి ఎలా వెల్తావు మరి ?"

"వచ్చే వారం కదా కౌన్సిలింగు అప్పటికి బాగానే ఉంటుంది... నాది జింబాడీలే పర్లేదు"

"నీ రాంకు చూసాను రా. సారీ రా, కానీ ఒక్క రాంకు తేడాయే కదరా దానికోసమే ఇలా..."

"రాంకు ఎదైతేనేమి లేరా... ఓటమి ఓటమేరా"

"ఇద్దరికీ ఒకే బ్రాంచు వస్తుందిలేరా ఎవ్వరూ ఓడరు"

"రాదురా... నీకేముంది రిజర్వేషన్లో మంచి సీటు వస్తుంది"

'అదీ నిజమే' అనుకున్నాడు. అయినా ఈ మాత్రం దానికే.....గణేష్ అనుకున్నాడు...
ఎంత జింబాడీ అయినా మనసులో చింత ఉన్నంతవరకూ విందుభోజనం పెట్టినా తిన్న తిండి సరిగ్గా అరగదు...

వారం గడిచింది....

కౌన్సెలింగ్ అయిపోయింది.... సరోజాదేవి స్పృహలో నుండి బయటకు వచ్చింది.... ఇంక ఈ న్యూస్ లో పసలేదని ఎన్.టీవీ వాళ్ళు కూడా పట్టించుకోవదం మానేసారు. తను ఒక్క ర్యాంకు కోసం ఇలాంటి పనికిరాని పని ఎందుకు చేసిందని కుమిలి కుమిలి ఏడిచింది. బ్రతికించినందుకు దేవునికీ డాక్టరుకీ కొబ్బరికాయ కొట్టింది !

హరీష్, గణేష్ ఇద్దరూ ఆసుపత్రికి వచ్చారూ.
"అమ్మా నాకు మెకానికల్ వచ్చింది"

సరోజా దేవి భోరున ఎడ్చింది...
"ఎంత పని చేసానురా నిన్ను నూతిలోకి తోసేసి"

"ఇప్పుడు అందరూ కోలుకున్నారు కదా అదే పదివేలు", అంది గణేష్ అమ్మ

"అమ్మా గణేష్ కి కూడా సేం బ్రాంచ్... రిజర్వేషన్ కోటా వాడుకోలేదు"

"అదేంటి బాబూ..."

"హరీష్ కోసం కాదాంటీ.... మా ఫైనాన్షియల్ స్టేటస్ బాగానే ఉంది... అందుకే నాకు రిజర్వేషన్ తీసుకోవడం అవసరం అనిపించలేదు !!!! "

ఇంతకీ వీడు మంచి వాడంటారా వెర్రి వాడంటారా ?