This blog is a Licensed work !

Thursday 9 September 2010

అణు బాంబు

pre-requisites :

1. ఇంకో అరగంటలో పెద్ద పనులేమీ లేవు కదా !! ఇంక చెలరేగండి

2. కొంచెం బ్యాండువిడ్తు ఉంటే కథలో ఇచ్చిన youtube లింకులు కూడా చూడచ్చు.
(కొంచెం ఓపిక పెడితే feedback కూడా ఇవ్వచ్చు)
ముందుమాట :

ఈ కథలో పెట్టిన వీడియో లింకులు ఆవి తెరకెక్కించిన దర్శకుల ఊహాశక్తికి అబ్బురపడి, వాటిమీద గౌరవంతో అందరికీ చూపించాలనే ఉర్దేశంతో పెట్టినది. కుదిరితే అవి కథ చివరిలో చూడండి.

భీభత్స్య రసం ఉంటుంది కాస్త prepare అవ్వండి ;)

----------------------


మొదటి అధ్యాయం : విద్యా సాగర్


రాత్రి పన్నెండు కాబోతూంది. ఊరంతా నిద్రపోతూంది. విద్యా సాగర్ గదిలో మాత్రం దీపం ఆరలేదు.

“ఇంకో రెండు లెక్కలు, అయిపోతుంది" అనుకుంటున్నాడు,
పుస్తకంలోకి దీర్ఘంగా చూస్తున్నాడు,

Q. probability of a rupee coin to get heads after ‘n’ th toss ?

దీర్ఘంగానే ఆలొచిస్తున్నడు….

“తట్టింది…”

రాయడం మొదలుపెట్టాడు…
'½ * ½ *…… '
ఇంతలో చేతిలోనుండి పెన్ను జారిపోయింది…

‘1/2*1/2…. 1/476…..4763322 కి అర్జెంటుగా ఫోన్ చెయ్యలి… సెల్ తీసి కాల్ చేసాడు, “హెల్లో….నిన్న డాక్టరు గారు నాకు మలేరియా ఉందని చెప్పారు ఏమైనా తగ్గిందా ?….నేను మందులేస్కోలేదా… సరే సరే వెస్కుంటా…” ఎక్కడున్నాయి…..

ఫట్ ఫట్.

నాన్న కుదుపుకి ఒక్క సారి ఉలిక్కిపడిలేచాడు విద్యాసాగర్.
“వెళ్ళి మంచం మీద పడుక్కోరా… “
“ఇంకొక్క question ఉంది అయిపోతుంది”
“అలా అర్థరాత్రుల దాకా చదవడం మంచిది కాదు రా”
“అయిపోతుంది నాన్నా అయిదు నిముషాలు”

‘చదివెస్తే పోలే’

Q. derive sin3x ?

---------------------------------------

పొద్దున్న ఎనిమిదయ్యింది. జెమిని టీవీలో బయోస్కోప్ చూస్తూ తింటున్నాడు….తినడం అయిపోయింది కానీ ఇంకా టీవీ చూస్తూనే ఉన్నాడు.

అమ్మ టైము చూసింది

“ఏరా వెళ్ళవా ?”
“ఒక్క నిముషం అణుబాంబు చూసి వెళ్ళిపోతా”
“అణుబాంబా… నీకు సినిమాల పిచ్చి ఎక్కువయిపోయింది...ఏమండీ వీడికి నాలుగు తగిలించండి”
“వద్దులే వెళ్తాను… ఈ రోజు మద్యాహ్నం ఇంటికి రాను సినిమా చూడటానికి వెళ్తాను”
“ డబ్బులెవరిస్తారు ?”
“నా 10th క్లాసు స్కాలర్షిప్ డబ్బులు ఉన్నాయి గా….”
“ఓరేయ్ వెధవా డబ్బులు తగలేస్తున్నావా ?”
“సర్లే వెళ్ళొస్తాను బాయ్”..పారిపోయాడు విద్యాసాగర్

ఆ రోజే రిలీజవుతున్న 'అణుబాంబు' ఆ సంవత్సరంలో వస్తున్న సెభాష్ స్టార్ సేనాపతి సినిమా. సేనాపతికి అప్పటికే వరుసగా మూడు పెద్ద హిట్లు వచ్చాయి, ఇప్పుడు ఇండస్ట్రీలో ఎన్నో అవార్డులతో ఎంతో ఎత్తుకి ఎదిగిన దర్శకుడు గణేష్ రావ్ సినిమాలో చేస్తున్నాడు, అప్పుడే పాటల అమ్మకాలు సగం లాభం తెచ్చేసాయి.
సైకిల్ని ఉరకలెత్తిస్తున్నాడు విద్యాసాగర్, తొందరగా వెళ్ళకపోతే పరీక్ష రాయటం ఆలస్యం అవుతుంది, అది ఆలస్యం అయితే మ్యాట్నీకి లైను పెరిగిపోతుంది…ఆలోచనలు వేగమందుకుంటున్నాయి…కాలేజీ కూడా దగ్గరకి వచ్చేసింది, పరిగెత్తాడు, గంట మోగింది, అందరికీ పరీక్షల ప్రశ్నాపత్రాలు ఇచ్చెస్తున్నారు….
ఆయాసంతో క్లాసులోకి వెళ్ళి కూర్చున్నాడు, పేపర్ తీసుకున్నాడు, ఎంత కష్టంగా ఉందో తెలుసుకోవడానికి పక్కోడికేసి చూసాడు, వాడు పేపర్లో లీనమయిపోయాడు, 'జై బొలొ గణెష్ మహరాజ్ కీ' అని వినాయకునికి దండం పెట్టాడు, పేపర్ చూసాడు…

Q. Describe the methods of prepatation for Benzene ?

ఉలిక్కిపడ్డాడు విద్యాసాగర్
“సార్ ఈ రోజు maths exam కాదా ?”,


రెండో అధ్యాయం: సంతుగాడు

(ముందు రోజు రాత్రి)
అర్థరాత్రయినా థియేటరు బయట హడావిడిగా ఉంది

“ఒరేయ్ సంతుగా… వెళ్ళి ఆ కలర్ పేపర్లు తేరా”, కటౌట్ కట్టడంలో రంగా బిజీగా ఉన్నాడు .
సంతుకి నిద్ర ముంచుకొచ్చెస్తూంది. అక్కడే హాలు బయట పడకేసెద్దామని దుప్పటి కూడా తెచ్చుకున్నాడు.
ఇంకో వైపు హాలు బయట దూరంలో ఒక పెద్దతను ఎవరికోసమో ఆరాతీస్తున్నాడు, అది సంతుగాడు పసిగట్టాడు

“అన్యా ఒక్క నిముషం అన్యా, మా నాన్నొచ్చాడు, వెతుకుతున్నాడు. అడిగితే లేనని చెప్పు”, అని బాత్రూంకి పారిపోయాడు.

సంతు నాన్న అడిగాడు
“ఏండీ మా కొడుకు సంతుగాడిని చూసారా”
“లేదండీ అసలు ఇక్కడకి రాలేదు…. ఎందుకు, ఎమైనా తేడా పనేమైనా చేసాడా ?”

“ఆ దరిద్రం-నా-కొడుకు ముందు సారి పబ్లిక్ రాయలేదు, ఇప్పుడు స్కూల్ నుండి తరిమేసారు…మొన్న ఇల్లొదిలి పారిపోయాడు, కాళ్ళా వేళ్ళా పడితే వెనక్కి వచ్చాడు”

“తెలీదండీ… దొరికితే చెప్తాను”

నాన్న వెళ్ళిపోయాడు.

“ఏరా సంతుగా పొరంబోకోడిలాగా ఊరంపట తిరుగుతున్నావంట కదా, ఇక్కడ ఇంకా నీతో పనుందని నీ సంగతి చెప్పలేదు. బతికిపోయవ్ వెళ్ళి ఆ ప్యాపరు తీసుకురా”
“సరే అన్యా… “
“ఆ దండ కూడా తీసుకురా”
“అన్యా ?”
“ఏంట్రా”
“రేపు టిక్కెట్లు ఇస్తారు కదన్యా”
"ఇస్తాంలేరా"
"రెండు కావలన్యా"
“నీకు ఒకటి చాలు కదా రెండెందుకురా”
“బ్లాక్లో అమ్ముకుంటానన్యా”
“ఒక్కటి కొడ్తే ముప్పైరెండు పళ్ళు రాల్తాయ్, నీకెందుకురా బ్లాక్ టిక్కెట్లు ?”
“అలా కాదన్యా…ఇంట్లో వాళ్ళకి కూడ డబ్బులొస్తాయని”
“ఎల్లుండి ఇంట్లో అడుగుతాను వాళ్ళకి రాలేదని తెలిసిందో బొక్కలో వెయిపిస్తా సరేనా”
“సరే అన్యా”


మూడవ అధ్యాయం : తోపులాట

ఎంత ప్రయత్నించినా ఒక్క సమాధానం కూడా రావట్లేదు

“ఈ పేపరు సున్నా”, ఖరారు చేసుకున్నాడు విద్యా సాగర్.
అప్పటికే చాలా బాధగా ఉంది తనకి తగిలిన షాకుకి. ఒక అరగంట సేపు ముందోడినీ పక్కోడినీ అడిగి ఒక నాలుగయిదు మార్కులు వచ్చేలా రాసాడు. గంటయ్యింది.

“సార్”, పేపరిచ్చి బయటదాకా అతి కష్టం మీద పరుగు ఆపుకొని నడిచాడు, బయటకెళ్ళాడో లేదో పరుగే పరుగు, ఇంత తొందరగా వెళ్తే మార్నింగు షోకి కాకపోయినా మ్యాట్నీకైనా టిక్కెట్లు దొరుకుతాయి అనే ఆనందం బాధని కమ్మేసింది. అసలే ఈ రోజు దీపావళి, ఎవడింట్లో వాడు బిజీగా ఉంటారు.

సైకిల్ వెగం పెంచాడు. హాలు వెనకన సైకిల్ పెట్టాడు. అటు వైపు గోల వినిపిస్తూంది. హాల్ ముందుకు వెళ్ళాడు.

అనుకున్నది తారుమారయ్యింది,
అక్కడున్న జనాన్ని చూసి విద్యాసాగర్ మతిపోయింది. వందల్లో ఉన్నరా వేలల్లో ఉన్నారా అని అనుమానం వచ్చింది.భక్తుల దర్శనంలాగా రెండు మెలికలు తిరిగిన పాములా ఉంది లైను, చివరిన ఉన్నాడు విద్యాసాగర్. ఎంత మంది ఉన్నారో అంచనా లెక్కపెట్టుకుంటున్నాడు కనీసం మ్యాటినీకి దొరక్కపొయినా సెకండుషో అయినా దొరక్కపోదా అనే ఆశ.

కౌంటరు తెరచుకుంది. ఒక్క నిముషంలో హడావిడి తుఫానులా పెరిగిపోయింది. లైను నెమ్మదిగా సాగుతూంది, కౌంటరు దగ్గర కొంత మంది అదే పనిగా పక్క నుండి ఎగిరి మనుషుల మీదకెక్కేసి టిక్కెట్లు లాగెస్తున్నారు. ముందు కోప్పడిన పోలీసు ఎటో వెళ్ళిపోయాడు. మార్ణింగు షో కి టిక్కెట్లు అయిపోయాయని ఎవడో అరిచాడు

దానితో మెల్లగా లైను బిగుసుకుంటూంది, ముందర దూకుతున్న వాళ్ళని చూసి వెనక వాళ్ళు సహించలేకపోతున్నారు. “అరెయ్ ముందుకు జరగండిరా ప్లేసు ఇవ్వద్దు ప్లేసు ఇవ్వద్దు”, ఇంకా బిగుసుకుపోయారు ఒక పది మీటర్ల లైనులో ఇప్పుదు వందమంది దాక ఉన్నారు.

విద్యాసాగర్ పొడుగవటం చేత గాలి ఆడుతూంది. కానీ ఒళ్ళంతా నొక్కుకుపోవడం చేత ఆ గాలి లోపలికెళ్ళట్లేదు. ఇంతలో “మ్యాటినీ, ఫస్టుషో అయిపోయాయి ”అని ఎవడో అరిచాడు. అది నిజమో పుకారో తెలియదు మరి.

ఇక్కడ విద్యా సాగర్ కి ఒళ్ళంతా అప్పడం అయిపోయింది, దొరుకుతుందా దొరకదా అనే ప్రశ్న కాస్తా బ్రతుకుతానా బ్రతకనా అన్నట్టు తయారయ్యింది !!
ఇంకొక్క క్షణం కూడా ఉండలేను అని రాడ్డు కింద నుండి దూరి బయటకు వచ్చేసాడు, ఇలా వచ్చాడో లేదో హౌస్ ఫుల్ బోర్డు కూడా పడింది.

చావు తప్పి కన్ను లొట్ట పడినట్టుంది విద్యాసాగర్ పరిస్థితి. ఏం చెయ్యాలో తోచట్లేదు, అప్పుడే ఇది రెండవ షాకు. ఇంట్లో వంట చెయ్యరాయె. సరే అని పక్కనే ఇడ్లీ హోటలు కేసి చూసాడు.


నాలుగవ అధ్యాయం: అదృష్తం

“సార్ ఇరవై టికెట్లు సార్ ఫాన్సుకి”, రంగా హాల్ మేనేజరుతో మాట్లాడుతున్నాడు
“అన్యా నాకు రెండు”, సంతుగాడు అడిగాడు
“ఇరవై ఒకటి”
మేనేజరుకి కోపం వచ్చింది
“ఎంటి ఎంతమందికి ఇవ్వాలి ? ఇదేమైనా సత్రం అనుకున్నావా, సినిమాహాలు అనుకున్నావా ?”,
“ఇంకొకడు కూడా ఉన్నాడండీ తినడానికి వెళ్ళాడు”

మొత్తానికి రెండు టికెట్లు సంపాదించాడు సంతుగాడు.

కొంత మంది బ్లాకు టికెట్టు కొంటారు. దొరకని వాళ్ళని పట్టుకోవాలి సంతుగాడు.
అలా ముగ్గురు దొరికారు,

“అన్యా టికెట్ కావలా”
“భయ్య నాక్కావలి”, ఇంకొకడు అడిగాడు
“యాభై అయిదొందలు”
“ఏరా బుడ్డోడా అయిదొందలా”
“ఓయ్ మాటలు తిన్నగా రానీ”, సంతుగాడికి కోపమొచ్చింది
“ఎంట్రా మాటలు అంటున్నవు పెద్దా చిన్నా లేదా... పోలీసులకి చెప్తే ఊసలు లెక్కెట్టిస్తారు”

టికెట్లు అడిగినప్పుడే అక్కడికి పదిమంది పోగయ్యారు, ఇప్పుడు గొడవ చూడటానికి యభై మంది పోగయ్యారు… ఎవడొ అరిచాడు “ఎంత చెప్తున్నాడు భయ్యా”
సంతుగాడికి భయమేసింది, “ఓయ్ నీ సంగతి తర్వాత చూస్తా” అని పారిపోయాడు

సంతుగాడు వేడి వేడిగా ఉన్నాడు,పక్కనే హొటల్లో ఇడ్లీలాగ. జేబులో పది రూపాయిలున్నాయి. ఆకలేస్తూంది. వెళ్ళి ఇడ్లీ చెప్పాడు.
పక్కన ఇంకొకడు తింటున్నాడు. వాడి అలసిపోయిన మొహం, తడిసిపోయిన ఒళ్ళు, కల్లల్లో ఆకలి .


“టిక్కెట్లు దొరకలేదా”, పసిగట్టాడు సంతుగాడు.
విద్యాసాగర్ ఎందుకొ మాట్లాడటానికి మొహమాటపడుతున్నాడు. తికెట్టు దొరక్క ఇరుక్కుపోయిన వైనం గుర్తొచ్చినట్టుంది
“నా దగ్గర ఒక టికెట్టుంది కావాలా”
విద్యాసాగర్ అప్పుడు చూసాడు సంతు వైపు, కళ్ళంతా నీరసం, ఎం మాట్లాడలేదు

“యాభై అయిదొందలు”
ఆశ్చర్యంగా చూసాడు విద్యాసాగర్, “నా దగ్గర రెండొందలుంది”

సంతుగాడికి ఏం చెయ్యాలో అర్థంకాలేదు, బయట తిట్టినోదు గుర్తొచ్చాడు వాడికంటే వీడే నయం అనిపించింది.
టికెట్టిచ్చేసాడు. ఎట్టకేలకు సినిమా చూడటానికి ఒక పార్ట్నర్ దొరికాడు.


అయిదవ అధ్యాయం: 'అణుబాంబు ' మొదటి హాఫ్

హాలు మొత్తం నిండిపొయింది. వాతావరణం అంతా గోల గోలగా ఉంది. సరిగ్గా హాలు మధ్యలో మంచి సీటు దొరికింది ఇద్దరికీ.

తెర లేవడం మొదలయ్యింది వెనకనున్న వెండితెర మెరుస్తూంది.

సినిమా మొదలయ్యింది, పేరు పడినవెంటనే ఈలలూ గోలలూ. బాంబులు పేలి పేర్లు పడుతున్నాయి. అప్పుడు పేపర్లు చింపి గాలిలో వెస్తూంటే ఆ ప్రొజక్టరు లైటులో తెరమీద మెరుస్తున్న ఆ దృశ్యం కేక !!

మొదటి సీనే యుద్ధం, ఎవడు బ్రతుకుతాడో కూడా పట్టించుకోని పరిస్థితిలో మసిపూసిన మొహాలతో యుద్దం చేస్తున్నారు. అప్పటికప్పుడు కొత్త కొత్త వ్యూహాలు వేస్తున్నారు. చూస్తున్న విద్యాసాగర్కి ఇది ఒక భయానక దృశ్యకావ్యం అని అర్థమవుతూంది, యుద్ధాలు ఎలా ఉంటాయో చూసే అదృష్టం ఎలగూ లేదు కనీసం ఇంత
వాస్తవాన్ని చూస్తూ ఆశ్చర్యపోతున్నాడు.

(మీ ఇమాజినేషన్ కోసం మచ్చుక్కి ఒక వీడియో - http://www.youtube.com/watch?v=1mojGryKRPo&feature=related)

కానీ సంతు పరిస్థితి అలాగ లేదు, అక్కడ ఎవరు ఎవరికోసం ఎవరు పేల్చుకుంటున్నారో అర్థం కావటం లేదు.

“ఒరేయ్ సేనాపతి ఎప్పుడొస్తాడు రా” అని అరిచాడు…

విద్యాసాగర్ కి నవ్వొచ్చింది
“భయ్యా అక్కడ యుద్ధం చేస్తూంది సేనాపతే”

ఆశ్చర్యపోయిన సంతు, “ఎంట్రీ సాంగు ఏదిబే”, అని అరిచాడు

కథ ముందుకు నడుస్తూంది, యుద్ధంలో సేనాపతి తప్ప తన తోటి వారందరూ చనిపోయారు. సేనాపతిని పట్టుకొని మిగిలిన బందీ సైనికులతో పాటు పడేసారు

అది చూస్తున్న చాలా మంది అభిమానులకి చిర్రెత్తింది, “ఈడు హీరో ఏంట్రా” అని ఎవడో అరిచాడు, యాంటీ-ఫ్యాన్స్ కి ఫ్యాన్స్ కి చిన్న గొడవ జరుగుతూంది.

ఇంతలో ఒక బాధాకరమైన పాట వస్తూంది,

'తడారిపోయిన ఎడారి బ్రతుకులు..
గుడారమంతా శవాల సొగసులు…
లడాయిలంటే భలే భలే…
బడాయి కోసం తలే బలే… '

ఆ సందర్భాన్ని తలచుకొని ఈ పదాలు వింటూంటే కళ్ళల్లో నీళ్ళు వస్తున్నాయి విద్యాసాగర్ కి.

ఇంతలో మూడవ ప్రపంచ యుద్ధం మొదలైపోయిందనీ, భారతదేశ నగరాల పరిస్థిథి కనీవినీ ఎరుగని దారిద్ర్యంలో ఉందనీ టీవీలో వార్తలు వస్తూ ఉంటాయి. హీరోయిన్ దీనిని చూస్తూ ఉంటుంది, హీరొయిన్ కొడుకు కోసం బయటకి వెళ్ళి చూసిన వెంటనే కొడుకు బయట ఆడుకుంటూ ఉంటాడు.

అప్పుడే ఎవరో స్లైడింగ్ డోర్ వ్యాన్లో వస్తారు, వచ్చి హీరోయిన్ని ఎత్తుకుపోతారు. చిన్న పిల్లాడు ఏడుస్తూ ఉంటాడు, తనని రోజంతా అక్కడే ఉండటం ఒకామే చూసి వెళ్ళి పోలీసులకి అప్పగిస్తుంది. ఆరాతీస్తే హీరొ ఆ బాబుకి నాన్న.

అకస్మాత్తుగా హీరో, హీరోయినుకి పెళ్ళి చూపులు అవుతూ ఉంటాయి.

“ఇదేంటి వీళ్ళు ఎప్పుడు కలిసారు”, సంతుగాడికి ఎమీ అర్థంకాలేదు
“భయ్యా ఇది ఫ్లాష్ బ్యాక్”, విద్యాసాగర్ వివరించాడు
“చెప్పేదేదో అర్థమయ్యేటట్టు చెప్పచ్చు కదా”
“మనమే కొంచెం బుర్ర పెడితే పోలా….”, విద్యాసాగర్ మళ్ళీ వివరించాడు

ఇంతలో హీరోయిను హెరో పెళ్ళి సీను, అప్పుడే మిలిటరీలో ఉద్యోగం వస్తుంది, తనకి ఈ విషయం చెప్పకుండా మోసం చేసాడని హెరోతో విడిపోతుంది. తను కాష్మీరు లో ఈమే కోనసీమలో కన్నుల పండుగగా ఒక పాట తెరక్కించారు.

“చూడ్డనికి ఏదో ఉందిగానీ హీరో ఓదిపోవడం చూస్తే చిరాకు వస్తూంది భయ్యా… ఒక ఐటెం సాంగ్ ఉన్నా బాగుండేది, కనీసం బ్రమ్మానందం అయినా వస్తాడంటావా ?”

“పాకిస్తాన్ ప్రెసిడెంటు తనే అయ్యుంటాడు”, విద్యాసాగర్ చలోక్తి విసిరాడు

ఇంతలో హీరో ఉండే బస్సు ఒక అడవిలోకి వెళ్ళింది… అక్కడ కొంతసేపు అందరినీ దాచారు రెఫ్యూజీలుగా తీసుకెళ్తున్నారు, ఇంతలో ఒకడు తన బూటులో ముక్కలు ముక్కలుగా ఉన్న తుపాకీని రెండు రోజులు కూర్చుని ఒక్కటిగా చేసి గార్డుని చంపాడు, వాడి తుపాకీ తీసుకోని హీరో ఇంకో ఇద్దరిని చంపారు అది చిన్నపాటి యుద్ధంగా మారి అక్కడ నుండి వేరే బట్టల్లో పారిపోతారు.
(మళ్ళీ ఇమాజినేషన్ కోసం - http://www.youtube.com/watch?v=eDv15w0N6Pc&feature=related )

అలా కొద్ది రోజుల పాటు తిండి తిప్పలు సరిగ్గాలేకుండా ఆ రషియా వాళ్ళ మిలట్రీలా బతికెస్తూ వేరే గుడారాలకి వెళ్ళి అక్కడ నుండి ప్రయాణించి నడుస్తూ దేశ సరిహద్దుల దగ్గరకి వస్తారు…
అక్కడకి ఇంటర్వల్ పడుతుంది.
అప్పటిదాకా ఈ కథని చూస్తున్న విద్యాసాగర్ కి చాలా బాగా నచ్చేసింది,

కానీ పక్కనే ఎవడో పెద్ద అంకుల్ ‘ఇది ఆడదు, ఆర్టు సినిమా’ అనేసి వెళ్ళిపోయాడు.


ఆరవ అధ్యాయం : 'అణు బాంబు' రెండవ హాఫ్

హీరో, అతని అనుచరులని బీ.ఎస్.ఎఫ్ వాళ్ళు బందీలుగా ఆఫీసుకి తీసుకెళ్ళారు.

“అదేంటి భయ్యా వీళ్ళు మనోళ్ళేగా”, సంతుగాడికి డౌటు వచ్చింది
“కానీ వేసుకున్న బట్టలు మనవి కాదు కదా”, సందేహం తీర్చాడు విద్యాసాగర్
“అయితే…హీరో ని గుర్తుపట్టలేరా”
“ఆడు హీరో అని అక్కడ వాళ్ళకి తెలీదుగా”

హీరో అక్కడ వాళ్ళని మాటల్లో కన్విన్సు చెయ్యించి ఆర్మీ జెనరల్తో మాట్లాడించి మళ్ళి తిరిగి వస్తారు. అక్కడ నుండి జరుగుతున్న రాజకీయ కథ మొదలవుతుంది. అసలు ఏ దేశం ఎవరిని ఎందుకు దాడి చేస్తూందో ఇంతెర్నాషనల్ రాజకీయం ఎలా ఉంటుందో అని ఊహకి అందని రీతిలో చూపిస్తూంటే విద్యాసాగరుకి మతిపోతూంది. నిజంగా ఎవడి దేశం అవసరం కోసం వాడు రంగులు మారుస్తాడా అని చూస్తున్నాడు.

అంతలోనే హీరో ఇంటికి ఫొన్ చేస్తాడు. ఏవరూ ఎత్తరు, అప్పుడు బాధలో సాగే ఒక డ్యూయెట్ పాట వస్తూ ఉంటుంది.

(మూడ్ కావాలా – మైమరచిపోండి - http://www.youtube.com/watch?v=ko6hCUWnWqI)

ఇంతలో

“బెమ్మానందం ఎప్పుడొస్తాడు రా” అని మల్లి అరిచాడు ఎవడో.

ఇంతలో యుద్ధంతో పెట్రేగిపోయిన కలకత్తా, ముంబాయి పట్టనాల్లో ఇంకా మంటల్లోనే ఉంటాయి. అవి చూస్తూంటే నిజంగా నగరాలని ఎలా మార్చేసారు రా బాబూ అని ఆలోచిస్తున్నాడు విద్యాసాగర్.ఇది ఒక కళాఖండమే అని నిర్ధారించుకుంటున్నాడు.

ఇంతలో ఆకాశం నుండి ప్లేన్లు వచ్చి అణుబాంబులు వేస్తాయి. దానిని చూపించిన విధానం చూసి హాలు మొత్తం నివ్వెర్రపోయింది
(ఈ మాదిరిలో ఉంటుంది - http://www.youtube.com/watch?v=gQgs9yi06bk&feature=related)

విషయం తెలిసిన అధికారి సైనికులు అందరూ కన్నెర్రజేసారు.ఒక పక్క ముంబైలో యుద్ధం జరుగుతూంది. ఇంతలో హీరో తన మిత్రుడు జెనెరల్ దగ్గరకి వెళ్ళి బాంబు వేసిన రషియా మీద దాడి చేస్తామని మొరాయిస్తారు, కానీ అది సరైన సమయం కాదని జెనెరల్ వాదిస్తాడు.

ఇంతలో జెనెరల్ కి ఫోను వస్తుంది, హీరోయినుని కిడ్నాప్ చేసారని తెలుస్తుంది. జెనెరల్ చేతులు వణుకుతాయి, హీరోయినుని నిస్సహాయ స్థితిలో తలచుకుని భయపడతాడు.

అప్పుడు తెలుస్తుంది, హీరో గూఢచారి అని. తన సీక్రెట్లు బయటికి రాకుండా తన పెళ్ళాన్ని కిడ్నాప్ చేసాడనే విషయం తెలుస్తుంది. ఇంతలో ఎక్కడో కిడ్నాపయిన హీరోయిన్ జీపులో నుండి తప్పించుకుని ఒక నగరంలోకి పారిపోతుంది. తనకి అక్కడ భాష అర్థం కాదు. ఇంతలో మరికొన్ని విమానాలు డిల్లీ మీదకి వస్తున్నాయనే విషయం తెలుస్తుంది.అందరూ విమానాల్లో బయలుదేరతారు.

ఒక వైపు గాలిలో యుద్ధాలు (ఈ మాదిరిలో ఉంటుంది - http://www.youtube.com/watch?v=C2rp4AowBYc), ఇంకొ వైపు హీరొయిన్ తప్పించుకొని ఆ నగరంలో మనుషులతో ఎదో మాట్లాడుతూ,కొంత మంది తనని వెంటపడుతూ, ఇంకొ వైపు కమాండర్ దీర్ఘాలోచనలో ఉంటాడు.

కథ కంచికొస్తూంది.

ఇంతలో యుద్ధ విమానలన్నీ యుద్ధానికి వెళ్తే, హీరో, తన పైలట్ రూటు మారుస్తారు. ఏం జరుగుతూందని ఆరా తీస్తే అయిర్ చీఫ్ మార్షల్ అణుబాంబుతో వాళ్ళని పంపించారన్న విషయం తెలుస్తుంది.

హీరో ప్రయాణమంతా హీరోయిన్ ఫోటో చూస్తూ ఉంటాడు. నిశబ్దంగా మారిపోతుంది, అటు హీరోయిన్ పడిలేస్తూ పరిగెడుతూ ఉంటుంది, అడుగు చప్పుళ్ళు మాత్రమే స్టీరియోలో వినిపిస్తూ ఉంటాయి, విద్యాసాగర్ కి ఉత్కంఠగా ఉంది, సంతుకి కూడా ఎదో అవుతుందని అనిపిస్తూంది.

హీరోయిను ఒక మనిషి కొట్టేసి తన సెల్ఫోన్ తీస్కుకొని పారిపోతుంది. కమాండర్ ఓపిక పట్టలేక హీరో పర్సనల్ నంబరుకి ఫోను చేస్తాడు. మాస్కో నగరానికి దగ్గరలో ఉంటాడు. హీరోకి కాలు వస్తుంది, ఎత్తితే హీరొయిను మాట్లాడుతుంది, నన్ను కిడ్నాప్ చేసారన్న విషయం నీకు చెప్పలేదా అని ఎడుస్తుంది

హీరొ మాస్కో దగ్గరకి వచ్చేసాడు, ముందు సీటులో ఉన్న హీరో ఫ్రెండు, కౌంట్ డౌన్ లెక్కెడతాడు

హీరో నుండి మాట రావట్లేదు…

‘ఎలా ఉన్నావు’ అంటాడు…
‘నన్ను కాపాడు’ అని హీరొయిన్ అంటుంది…
‘ఎక్కడ ఉన్నావూ..

కౌంటు డౌన్ అయిదు కి వస్తుంది

‘ఎమో ’ అని ఇటు అటు చూసి… ‘ఎదో అర్థమయినట్టు’
‘ఆ అది…’

కౌంట్డౌన్ ఒకటి

‘మాస్కో’ అంటుంది

హీరో రియాక్ట్ అయ్యే లోపు బటన్ నొక్కేసాడు స్నేహితుడు
సినిమా అంతా స్లో మోషన్లోకి వెల్లిపోతుంది, వయలిన్లు మెల్లగా మ్రోగుతున్నాయి… అణుబాంబు పేలడానికి రెండు నిముషాలుందని చెబుతాడు, ప్లేను వెనక్కి తిరుగుతుంది.

హీరోయిన్ అలాగే రోడ్డు పక్కన కూర్చుని ఎకాంతంగా ఉంటుంది
‘బాబు జాగ్రత్తండీ’

హీరో నోటి మాట రాదు

‘ఎమండీ ఉన్నారా ?’
‘నీకొకటి చెప్పాలి’
‘ఏంటది’
‘సారీ… నేను మిలిటరీలో జాయిన్ అవుతున్నానన్న సంగతి ఆ రోజు చెప్పలేదు’
‘పర్వలేదు, నా కోసం వస్తారు కదా’, అని ఎడుస్తూ నవ్వుతుంది
‘వస్తాను ఇప్పుడే వస్తాను’
అని ప్లేనులో నుండి ఎజెక్టు బటన్ నొక్కి ఎగిరిపోతాడు

ఇంకో పది సెకండ్లు…
అణు బాంబు మాస్కోలో పడి కిందున్న హీరొయిన్ పైనున్న హీరో ఇద్దరూ ఆవిరయిపోతారు… వాల్ల పిల్లాడు ఇంట్లో ఏడుస్తూ ఉంటాడు, సినిమా అయిపోయింది


ఏడవ అధ్యాయం : రిజల్టు

అందరూ తిట్టుకుంటూ బయటికి వెళ్తున్నారు

సంతుగాడు అన్నాడు “అన్న బాంబుని పట్టుకుంటాడనుకున్నా, సచ్చిపోడమేంటెహె”

విద్యాసాగర్ ఇంకా ఆ భీభత్సకాండ నుండి బయటికి రాలేదు, కంటతడి అలానే మిగిలి ఉంది….


సినిమా నెల బాగా ఆడింది, తర్వాత ఎవడూ పట్టించుకోలేదు. కానీ ఆ సంవత్సరాంతంకి ఫారిన్ ఆస్కరులో పోటీ పడి గెలుచుకుంది.

సేనాపతి కి తిరుగులేదన్నారు. గణేష్రావ్ ని ప్రపంచమంతా గుర్తించింది, కానీ తన తర్వాత సినిమా కూడా పోయింది, అందులో కూడా బెమ్మనందాన్ని పెట్టలేదు మరి.

విద్యాసాగరు ఏ సినిమా కొత్తగా అనిపించక చూడటం ఆపేసాడు, అసలుకే ఒక సారి సినిమా కోసం పరీక్ష పోగొట్టుకున్నాడనే ఫీలింగు కూడా ఉండిపోయింది.ఏరోనాటిక్స్ లోకి వేల్డామని కృషి చేస్తున్నడు.

సంతుగాడు ఫ్యాన్ క్లబ్బు వాళ్ళ రాజకీయ పార్టీ లో కార్యకర్తగా వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాడు.

-----------------------