This blog is a Licensed work !

Thursday 9 September 2010

అణు బాంబు

pre-requisites :

1. ఇంకో అరగంటలో పెద్ద పనులేమీ లేవు కదా !! ఇంక చెలరేగండి

2. కొంచెం బ్యాండువిడ్తు ఉంటే కథలో ఇచ్చిన youtube లింకులు కూడా చూడచ్చు.
(కొంచెం ఓపిక పెడితే feedback కూడా ఇవ్వచ్చు)
ముందుమాట :

ఈ కథలో పెట్టిన వీడియో లింకులు ఆవి తెరకెక్కించిన దర్శకుల ఊహాశక్తికి అబ్బురపడి, వాటిమీద గౌరవంతో అందరికీ చూపించాలనే ఉర్దేశంతో పెట్టినది. కుదిరితే అవి కథ చివరిలో చూడండి.

భీభత్స్య రసం ఉంటుంది కాస్త prepare అవ్వండి ;)

----------------------


మొదటి అధ్యాయం : విద్యా సాగర్


రాత్రి పన్నెండు కాబోతూంది. ఊరంతా నిద్రపోతూంది. విద్యా సాగర్ గదిలో మాత్రం దీపం ఆరలేదు.

“ఇంకో రెండు లెక్కలు, అయిపోతుంది" అనుకుంటున్నాడు,
పుస్తకంలోకి దీర్ఘంగా చూస్తున్నాడు,

Q. probability of a rupee coin to get heads after ‘n’ th toss ?

దీర్ఘంగానే ఆలొచిస్తున్నడు….

“తట్టింది…”

రాయడం మొదలుపెట్టాడు…
'½ * ½ *…… '
ఇంతలో చేతిలోనుండి పెన్ను జారిపోయింది…

‘1/2*1/2…. 1/476…..4763322 కి అర్జెంటుగా ఫోన్ చెయ్యలి… సెల్ తీసి కాల్ చేసాడు, “హెల్లో….నిన్న డాక్టరు గారు నాకు మలేరియా ఉందని చెప్పారు ఏమైనా తగ్గిందా ?….నేను మందులేస్కోలేదా… సరే సరే వెస్కుంటా…” ఎక్కడున్నాయి…..

ఫట్ ఫట్.

నాన్న కుదుపుకి ఒక్క సారి ఉలిక్కిపడిలేచాడు విద్యాసాగర్.
“వెళ్ళి మంచం మీద పడుక్కోరా… “
“ఇంకొక్క question ఉంది అయిపోతుంది”
“అలా అర్థరాత్రుల దాకా చదవడం మంచిది కాదు రా”
“అయిపోతుంది నాన్నా అయిదు నిముషాలు”

‘చదివెస్తే పోలే’

Q. derive sin3x ?

---------------------------------------

పొద్దున్న ఎనిమిదయ్యింది. జెమిని టీవీలో బయోస్కోప్ చూస్తూ తింటున్నాడు….తినడం అయిపోయింది కానీ ఇంకా టీవీ చూస్తూనే ఉన్నాడు.

అమ్మ టైము చూసింది

“ఏరా వెళ్ళవా ?”
“ఒక్క నిముషం అణుబాంబు చూసి వెళ్ళిపోతా”
“అణుబాంబా… నీకు సినిమాల పిచ్చి ఎక్కువయిపోయింది...ఏమండీ వీడికి నాలుగు తగిలించండి”
“వద్దులే వెళ్తాను… ఈ రోజు మద్యాహ్నం ఇంటికి రాను సినిమా చూడటానికి వెళ్తాను”
“ డబ్బులెవరిస్తారు ?”
“నా 10th క్లాసు స్కాలర్షిప్ డబ్బులు ఉన్నాయి గా….”
“ఓరేయ్ వెధవా డబ్బులు తగలేస్తున్నావా ?”
“సర్లే వెళ్ళొస్తాను బాయ్”..పారిపోయాడు విద్యాసాగర్

ఆ రోజే రిలీజవుతున్న 'అణుబాంబు' ఆ సంవత్సరంలో వస్తున్న సెభాష్ స్టార్ సేనాపతి సినిమా. సేనాపతికి అప్పటికే వరుసగా మూడు పెద్ద హిట్లు వచ్చాయి, ఇప్పుడు ఇండస్ట్రీలో ఎన్నో అవార్డులతో ఎంతో ఎత్తుకి ఎదిగిన దర్శకుడు గణేష్ రావ్ సినిమాలో చేస్తున్నాడు, అప్పుడే పాటల అమ్మకాలు సగం లాభం తెచ్చేసాయి.
సైకిల్ని ఉరకలెత్తిస్తున్నాడు విద్యాసాగర్, తొందరగా వెళ్ళకపోతే పరీక్ష రాయటం ఆలస్యం అవుతుంది, అది ఆలస్యం అయితే మ్యాట్నీకి లైను పెరిగిపోతుంది…ఆలోచనలు వేగమందుకుంటున్నాయి…కాలేజీ కూడా దగ్గరకి వచ్చేసింది, పరిగెత్తాడు, గంట మోగింది, అందరికీ పరీక్షల ప్రశ్నాపత్రాలు ఇచ్చెస్తున్నారు….
ఆయాసంతో క్లాసులోకి వెళ్ళి కూర్చున్నాడు, పేపర్ తీసుకున్నాడు, ఎంత కష్టంగా ఉందో తెలుసుకోవడానికి పక్కోడికేసి చూసాడు, వాడు పేపర్లో లీనమయిపోయాడు, 'జై బొలొ గణెష్ మహరాజ్ కీ' అని వినాయకునికి దండం పెట్టాడు, పేపర్ చూసాడు…

Q. Describe the methods of prepatation for Benzene ?

ఉలిక్కిపడ్డాడు విద్యాసాగర్
“సార్ ఈ రోజు maths exam కాదా ?”,


రెండో అధ్యాయం: సంతుగాడు

(ముందు రోజు రాత్రి)
అర్థరాత్రయినా థియేటరు బయట హడావిడిగా ఉంది

“ఒరేయ్ సంతుగా… వెళ్ళి ఆ కలర్ పేపర్లు తేరా”, కటౌట్ కట్టడంలో రంగా బిజీగా ఉన్నాడు .
సంతుకి నిద్ర ముంచుకొచ్చెస్తూంది. అక్కడే హాలు బయట పడకేసెద్దామని దుప్పటి కూడా తెచ్చుకున్నాడు.
ఇంకో వైపు హాలు బయట దూరంలో ఒక పెద్దతను ఎవరికోసమో ఆరాతీస్తున్నాడు, అది సంతుగాడు పసిగట్టాడు

“అన్యా ఒక్క నిముషం అన్యా, మా నాన్నొచ్చాడు, వెతుకుతున్నాడు. అడిగితే లేనని చెప్పు”, అని బాత్రూంకి పారిపోయాడు.

సంతు నాన్న అడిగాడు
“ఏండీ మా కొడుకు సంతుగాడిని చూసారా”
“లేదండీ అసలు ఇక్కడకి రాలేదు…. ఎందుకు, ఎమైనా తేడా పనేమైనా చేసాడా ?”

“ఆ దరిద్రం-నా-కొడుకు ముందు సారి పబ్లిక్ రాయలేదు, ఇప్పుడు స్కూల్ నుండి తరిమేసారు…మొన్న ఇల్లొదిలి పారిపోయాడు, కాళ్ళా వేళ్ళా పడితే వెనక్కి వచ్చాడు”

“తెలీదండీ… దొరికితే చెప్తాను”

నాన్న వెళ్ళిపోయాడు.

“ఏరా సంతుగా పొరంబోకోడిలాగా ఊరంపట తిరుగుతున్నావంట కదా, ఇక్కడ ఇంకా నీతో పనుందని నీ సంగతి చెప్పలేదు. బతికిపోయవ్ వెళ్ళి ఆ ప్యాపరు తీసుకురా”
“సరే అన్యా… “
“ఆ దండ కూడా తీసుకురా”
“అన్యా ?”
“ఏంట్రా”
“రేపు టిక్కెట్లు ఇస్తారు కదన్యా”
"ఇస్తాంలేరా"
"రెండు కావలన్యా"
“నీకు ఒకటి చాలు కదా రెండెందుకురా”
“బ్లాక్లో అమ్ముకుంటానన్యా”
“ఒక్కటి కొడ్తే ముప్పైరెండు పళ్ళు రాల్తాయ్, నీకెందుకురా బ్లాక్ టిక్కెట్లు ?”
“అలా కాదన్యా…ఇంట్లో వాళ్ళకి కూడ డబ్బులొస్తాయని”
“ఎల్లుండి ఇంట్లో అడుగుతాను వాళ్ళకి రాలేదని తెలిసిందో బొక్కలో వెయిపిస్తా సరేనా”
“సరే అన్యా”


మూడవ అధ్యాయం : తోపులాట

ఎంత ప్రయత్నించినా ఒక్క సమాధానం కూడా రావట్లేదు

“ఈ పేపరు సున్నా”, ఖరారు చేసుకున్నాడు విద్యా సాగర్.
అప్పటికే చాలా బాధగా ఉంది తనకి తగిలిన షాకుకి. ఒక అరగంట సేపు ముందోడినీ పక్కోడినీ అడిగి ఒక నాలుగయిదు మార్కులు వచ్చేలా రాసాడు. గంటయ్యింది.

“సార్”, పేపరిచ్చి బయటదాకా అతి కష్టం మీద పరుగు ఆపుకొని నడిచాడు, బయటకెళ్ళాడో లేదో పరుగే పరుగు, ఇంత తొందరగా వెళ్తే మార్నింగు షోకి కాకపోయినా మ్యాట్నీకైనా టిక్కెట్లు దొరుకుతాయి అనే ఆనందం బాధని కమ్మేసింది. అసలే ఈ రోజు దీపావళి, ఎవడింట్లో వాడు బిజీగా ఉంటారు.

సైకిల్ వెగం పెంచాడు. హాలు వెనకన సైకిల్ పెట్టాడు. అటు వైపు గోల వినిపిస్తూంది. హాల్ ముందుకు వెళ్ళాడు.

అనుకున్నది తారుమారయ్యింది,
అక్కడున్న జనాన్ని చూసి విద్యాసాగర్ మతిపోయింది. వందల్లో ఉన్నరా వేలల్లో ఉన్నారా అని అనుమానం వచ్చింది.భక్తుల దర్శనంలాగా రెండు మెలికలు తిరిగిన పాములా ఉంది లైను, చివరిన ఉన్నాడు విద్యాసాగర్. ఎంత మంది ఉన్నారో అంచనా లెక్కపెట్టుకుంటున్నాడు కనీసం మ్యాటినీకి దొరక్కపొయినా సెకండుషో అయినా దొరక్కపోదా అనే ఆశ.

కౌంటరు తెరచుకుంది. ఒక్క నిముషంలో హడావిడి తుఫానులా పెరిగిపోయింది. లైను నెమ్మదిగా సాగుతూంది, కౌంటరు దగ్గర కొంత మంది అదే పనిగా పక్క నుండి ఎగిరి మనుషుల మీదకెక్కేసి టిక్కెట్లు లాగెస్తున్నారు. ముందు కోప్పడిన పోలీసు ఎటో వెళ్ళిపోయాడు. మార్ణింగు షో కి టిక్కెట్లు అయిపోయాయని ఎవడో అరిచాడు

దానితో మెల్లగా లైను బిగుసుకుంటూంది, ముందర దూకుతున్న వాళ్ళని చూసి వెనక వాళ్ళు సహించలేకపోతున్నారు. “అరెయ్ ముందుకు జరగండిరా ప్లేసు ఇవ్వద్దు ప్లేసు ఇవ్వద్దు”, ఇంకా బిగుసుకుపోయారు ఒక పది మీటర్ల లైనులో ఇప్పుదు వందమంది దాక ఉన్నారు.

విద్యాసాగర్ పొడుగవటం చేత గాలి ఆడుతూంది. కానీ ఒళ్ళంతా నొక్కుకుపోవడం చేత ఆ గాలి లోపలికెళ్ళట్లేదు. ఇంతలో “మ్యాటినీ, ఫస్టుషో అయిపోయాయి ”అని ఎవడో అరిచాడు. అది నిజమో పుకారో తెలియదు మరి.

ఇక్కడ విద్యా సాగర్ కి ఒళ్ళంతా అప్పడం అయిపోయింది, దొరుకుతుందా దొరకదా అనే ప్రశ్న కాస్తా బ్రతుకుతానా బ్రతకనా అన్నట్టు తయారయ్యింది !!
ఇంకొక్క క్షణం కూడా ఉండలేను అని రాడ్డు కింద నుండి దూరి బయటకు వచ్చేసాడు, ఇలా వచ్చాడో లేదో హౌస్ ఫుల్ బోర్డు కూడా పడింది.

చావు తప్పి కన్ను లొట్ట పడినట్టుంది విద్యాసాగర్ పరిస్థితి. ఏం చెయ్యాలో తోచట్లేదు, అప్పుడే ఇది రెండవ షాకు. ఇంట్లో వంట చెయ్యరాయె. సరే అని పక్కనే ఇడ్లీ హోటలు కేసి చూసాడు.


నాలుగవ అధ్యాయం: అదృష్తం

“సార్ ఇరవై టికెట్లు సార్ ఫాన్సుకి”, రంగా హాల్ మేనేజరుతో మాట్లాడుతున్నాడు
“అన్యా నాకు రెండు”, సంతుగాడు అడిగాడు
“ఇరవై ఒకటి”
మేనేజరుకి కోపం వచ్చింది
“ఎంటి ఎంతమందికి ఇవ్వాలి ? ఇదేమైనా సత్రం అనుకున్నావా, సినిమాహాలు అనుకున్నావా ?”,
“ఇంకొకడు కూడా ఉన్నాడండీ తినడానికి వెళ్ళాడు”

మొత్తానికి రెండు టికెట్లు సంపాదించాడు సంతుగాడు.

కొంత మంది బ్లాకు టికెట్టు కొంటారు. దొరకని వాళ్ళని పట్టుకోవాలి సంతుగాడు.
అలా ముగ్గురు దొరికారు,

“అన్యా టికెట్ కావలా”
“భయ్య నాక్కావలి”, ఇంకొకడు అడిగాడు
“యాభై అయిదొందలు”
“ఏరా బుడ్డోడా అయిదొందలా”
“ఓయ్ మాటలు తిన్నగా రానీ”, సంతుగాడికి కోపమొచ్చింది
“ఎంట్రా మాటలు అంటున్నవు పెద్దా చిన్నా లేదా... పోలీసులకి చెప్తే ఊసలు లెక్కెట్టిస్తారు”

టికెట్లు అడిగినప్పుడే అక్కడికి పదిమంది పోగయ్యారు, ఇప్పుడు గొడవ చూడటానికి యభై మంది పోగయ్యారు… ఎవడొ అరిచాడు “ఎంత చెప్తున్నాడు భయ్యా”
సంతుగాడికి భయమేసింది, “ఓయ్ నీ సంగతి తర్వాత చూస్తా” అని పారిపోయాడు

సంతుగాడు వేడి వేడిగా ఉన్నాడు,పక్కనే హొటల్లో ఇడ్లీలాగ. జేబులో పది రూపాయిలున్నాయి. ఆకలేస్తూంది. వెళ్ళి ఇడ్లీ చెప్పాడు.
పక్కన ఇంకొకడు తింటున్నాడు. వాడి అలసిపోయిన మొహం, తడిసిపోయిన ఒళ్ళు, కల్లల్లో ఆకలి .


“టిక్కెట్లు దొరకలేదా”, పసిగట్టాడు సంతుగాడు.
విద్యాసాగర్ ఎందుకొ మాట్లాడటానికి మొహమాటపడుతున్నాడు. తికెట్టు దొరక్క ఇరుక్కుపోయిన వైనం గుర్తొచ్చినట్టుంది
“నా దగ్గర ఒక టికెట్టుంది కావాలా”
విద్యాసాగర్ అప్పుడు చూసాడు సంతు వైపు, కళ్ళంతా నీరసం, ఎం మాట్లాడలేదు

“యాభై అయిదొందలు”
ఆశ్చర్యంగా చూసాడు విద్యాసాగర్, “నా దగ్గర రెండొందలుంది”

సంతుగాడికి ఏం చెయ్యాలో అర్థంకాలేదు, బయట తిట్టినోదు గుర్తొచ్చాడు వాడికంటే వీడే నయం అనిపించింది.
టికెట్టిచ్చేసాడు. ఎట్టకేలకు సినిమా చూడటానికి ఒక పార్ట్నర్ దొరికాడు.


అయిదవ అధ్యాయం: 'అణుబాంబు ' మొదటి హాఫ్

హాలు మొత్తం నిండిపొయింది. వాతావరణం అంతా గోల గోలగా ఉంది. సరిగ్గా హాలు మధ్యలో మంచి సీటు దొరికింది ఇద్దరికీ.

తెర లేవడం మొదలయ్యింది వెనకనున్న వెండితెర మెరుస్తూంది.

సినిమా మొదలయ్యింది, పేరు పడినవెంటనే ఈలలూ గోలలూ. బాంబులు పేలి పేర్లు పడుతున్నాయి. అప్పుడు పేపర్లు చింపి గాలిలో వెస్తూంటే ఆ ప్రొజక్టరు లైటులో తెరమీద మెరుస్తున్న ఆ దృశ్యం కేక !!

మొదటి సీనే యుద్ధం, ఎవడు బ్రతుకుతాడో కూడా పట్టించుకోని పరిస్థితిలో మసిపూసిన మొహాలతో యుద్దం చేస్తున్నారు. అప్పటికప్పుడు కొత్త కొత్త వ్యూహాలు వేస్తున్నారు. చూస్తున్న విద్యాసాగర్కి ఇది ఒక భయానక దృశ్యకావ్యం అని అర్థమవుతూంది, యుద్ధాలు ఎలా ఉంటాయో చూసే అదృష్టం ఎలగూ లేదు కనీసం ఇంత
వాస్తవాన్ని చూస్తూ ఆశ్చర్యపోతున్నాడు.

(మీ ఇమాజినేషన్ కోసం మచ్చుక్కి ఒక వీడియో - http://www.youtube.com/watch?v=1mojGryKRPo&feature=related)

కానీ సంతు పరిస్థితి అలాగ లేదు, అక్కడ ఎవరు ఎవరికోసం ఎవరు పేల్చుకుంటున్నారో అర్థం కావటం లేదు.

“ఒరేయ్ సేనాపతి ఎప్పుడొస్తాడు రా” అని అరిచాడు…

విద్యాసాగర్ కి నవ్వొచ్చింది
“భయ్యా అక్కడ యుద్ధం చేస్తూంది సేనాపతే”

ఆశ్చర్యపోయిన సంతు, “ఎంట్రీ సాంగు ఏదిబే”, అని అరిచాడు

కథ ముందుకు నడుస్తూంది, యుద్ధంలో సేనాపతి తప్ప తన తోటి వారందరూ చనిపోయారు. సేనాపతిని పట్టుకొని మిగిలిన బందీ సైనికులతో పాటు పడేసారు

అది చూస్తున్న చాలా మంది అభిమానులకి చిర్రెత్తింది, “ఈడు హీరో ఏంట్రా” అని ఎవడో అరిచాడు, యాంటీ-ఫ్యాన్స్ కి ఫ్యాన్స్ కి చిన్న గొడవ జరుగుతూంది.

ఇంతలో ఒక బాధాకరమైన పాట వస్తూంది,

'తడారిపోయిన ఎడారి బ్రతుకులు..
గుడారమంతా శవాల సొగసులు…
లడాయిలంటే భలే భలే…
బడాయి కోసం తలే బలే… '

ఆ సందర్భాన్ని తలచుకొని ఈ పదాలు వింటూంటే కళ్ళల్లో నీళ్ళు వస్తున్నాయి విద్యాసాగర్ కి.

ఇంతలో మూడవ ప్రపంచ యుద్ధం మొదలైపోయిందనీ, భారతదేశ నగరాల పరిస్థిథి కనీవినీ ఎరుగని దారిద్ర్యంలో ఉందనీ టీవీలో వార్తలు వస్తూ ఉంటాయి. హీరోయిన్ దీనిని చూస్తూ ఉంటుంది, హీరొయిన్ కొడుకు కోసం బయటకి వెళ్ళి చూసిన వెంటనే కొడుకు బయట ఆడుకుంటూ ఉంటాడు.

అప్పుడే ఎవరో స్లైడింగ్ డోర్ వ్యాన్లో వస్తారు, వచ్చి హీరోయిన్ని ఎత్తుకుపోతారు. చిన్న పిల్లాడు ఏడుస్తూ ఉంటాడు, తనని రోజంతా అక్కడే ఉండటం ఒకామే చూసి వెళ్ళి పోలీసులకి అప్పగిస్తుంది. ఆరాతీస్తే హీరొ ఆ బాబుకి నాన్న.

అకస్మాత్తుగా హీరో, హీరోయినుకి పెళ్ళి చూపులు అవుతూ ఉంటాయి.

“ఇదేంటి వీళ్ళు ఎప్పుడు కలిసారు”, సంతుగాడికి ఎమీ అర్థంకాలేదు
“భయ్యా ఇది ఫ్లాష్ బ్యాక్”, విద్యాసాగర్ వివరించాడు
“చెప్పేదేదో అర్థమయ్యేటట్టు చెప్పచ్చు కదా”
“మనమే కొంచెం బుర్ర పెడితే పోలా….”, విద్యాసాగర్ మళ్ళీ వివరించాడు

ఇంతలో హీరోయిను హెరో పెళ్ళి సీను, అప్పుడే మిలిటరీలో ఉద్యోగం వస్తుంది, తనకి ఈ విషయం చెప్పకుండా మోసం చేసాడని హెరోతో విడిపోతుంది. తను కాష్మీరు లో ఈమే కోనసీమలో కన్నుల పండుగగా ఒక పాట తెరక్కించారు.

“చూడ్డనికి ఏదో ఉందిగానీ హీరో ఓదిపోవడం చూస్తే చిరాకు వస్తూంది భయ్యా… ఒక ఐటెం సాంగ్ ఉన్నా బాగుండేది, కనీసం బ్రమ్మానందం అయినా వస్తాడంటావా ?”

“పాకిస్తాన్ ప్రెసిడెంటు తనే అయ్యుంటాడు”, విద్యాసాగర్ చలోక్తి విసిరాడు

ఇంతలో హీరో ఉండే బస్సు ఒక అడవిలోకి వెళ్ళింది… అక్కడ కొంతసేపు అందరినీ దాచారు రెఫ్యూజీలుగా తీసుకెళ్తున్నారు, ఇంతలో ఒకడు తన బూటులో ముక్కలు ముక్కలుగా ఉన్న తుపాకీని రెండు రోజులు కూర్చుని ఒక్కటిగా చేసి గార్డుని చంపాడు, వాడి తుపాకీ తీసుకోని హీరో ఇంకో ఇద్దరిని చంపారు అది చిన్నపాటి యుద్ధంగా మారి అక్కడ నుండి వేరే బట్టల్లో పారిపోతారు.
(మళ్ళీ ఇమాజినేషన్ కోసం - http://www.youtube.com/watch?v=eDv15w0N6Pc&feature=related )

అలా కొద్ది రోజుల పాటు తిండి తిప్పలు సరిగ్గాలేకుండా ఆ రషియా వాళ్ళ మిలట్రీలా బతికెస్తూ వేరే గుడారాలకి వెళ్ళి అక్కడ నుండి ప్రయాణించి నడుస్తూ దేశ సరిహద్దుల దగ్గరకి వస్తారు…
అక్కడకి ఇంటర్వల్ పడుతుంది.
అప్పటిదాకా ఈ కథని చూస్తున్న విద్యాసాగర్ కి చాలా బాగా నచ్చేసింది,

కానీ పక్కనే ఎవడో పెద్ద అంకుల్ ‘ఇది ఆడదు, ఆర్టు సినిమా’ అనేసి వెళ్ళిపోయాడు.


ఆరవ అధ్యాయం : 'అణు బాంబు' రెండవ హాఫ్

హీరో, అతని అనుచరులని బీ.ఎస్.ఎఫ్ వాళ్ళు బందీలుగా ఆఫీసుకి తీసుకెళ్ళారు.

“అదేంటి భయ్యా వీళ్ళు మనోళ్ళేగా”, సంతుగాడికి డౌటు వచ్చింది
“కానీ వేసుకున్న బట్టలు మనవి కాదు కదా”, సందేహం తీర్చాడు విద్యాసాగర్
“అయితే…హీరో ని గుర్తుపట్టలేరా”
“ఆడు హీరో అని అక్కడ వాళ్ళకి తెలీదుగా”

హీరో అక్కడ వాళ్ళని మాటల్లో కన్విన్సు చెయ్యించి ఆర్మీ జెనరల్తో మాట్లాడించి మళ్ళి తిరిగి వస్తారు. అక్కడ నుండి జరుగుతున్న రాజకీయ కథ మొదలవుతుంది. అసలు ఏ దేశం ఎవరిని ఎందుకు దాడి చేస్తూందో ఇంతెర్నాషనల్ రాజకీయం ఎలా ఉంటుందో అని ఊహకి అందని రీతిలో చూపిస్తూంటే విద్యాసాగరుకి మతిపోతూంది. నిజంగా ఎవడి దేశం అవసరం కోసం వాడు రంగులు మారుస్తాడా అని చూస్తున్నాడు.

అంతలోనే హీరో ఇంటికి ఫొన్ చేస్తాడు. ఏవరూ ఎత్తరు, అప్పుడు బాధలో సాగే ఒక డ్యూయెట్ పాట వస్తూ ఉంటుంది.

(మూడ్ కావాలా – మైమరచిపోండి - http://www.youtube.com/watch?v=ko6hCUWnWqI)

ఇంతలో

“బెమ్మానందం ఎప్పుడొస్తాడు రా” అని మల్లి అరిచాడు ఎవడో.

ఇంతలో యుద్ధంతో పెట్రేగిపోయిన కలకత్తా, ముంబాయి పట్టనాల్లో ఇంకా మంటల్లోనే ఉంటాయి. అవి చూస్తూంటే నిజంగా నగరాలని ఎలా మార్చేసారు రా బాబూ అని ఆలోచిస్తున్నాడు విద్యాసాగర్.ఇది ఒక కళాఖండమే అని నిర్ధారించుకుంటున్నాడు.

ఇంతలో ఆకాశం నుండి ప్లేన్లు వచ్చి అణుబాంబులు వేస్తాయి. దానిని చూపించిన విధానం చూసి హాలు మొత్తం నివ్వెర్రపోయింది
(ఈ మాదిరిలో ఉంటుంది - http://www.youtube.com/watch?v=gQgs9yi06bk&feature=related)

విషయం తెలిసిన అధికారి సైనికులు అందరూ కన్నెర్రజేసారు.ఒక పక్క ముంబైలో యుద్ధం జరుగుతూంది. ఇంతలో హీరో తన మిత్రుడు జెనెరల్ దగ్గరకి వెళ్ళి బాంబు వేసిన రషియా మీద దాడి చేస్తామని మొరాయిస్తారు, కానీ అది సరైన సమయం కాదని జెనెరల్ వాదిస్తాడు.

ఇంతలో జెనెరల్ కి ఫోను వస్తుంది, హీరోయినుని కిడ్నాప్ చేసారని తెలుస్తుంది. జెనెరల్ చేతులు వణుకుతాయి, హీరోయినుని నిస్సహాయ స్థితిలో తలచుకుని భయపడతాడు.

అప్పుడు తెలుస్తుంది, హీరో గూఢచారి అని. తన సీక్రెట్లు బయటికి రాకుండా తన పెళ్ళాన్ని కిడ్నాప్ చేసాడనే విషయం తెలుస్తుంది. ఇంతలో ఎక్కడో కిడ్నాపయిన హీరోయిన్ జీపులో నుండి తప్పించుకుని ఒక నగరంలోకి పారిపోతుంది. తనకి అక్కడ భాష అర్థం కాదు. ఇంతలో మరికొన్ని విమానాలు డిల్లీ మీదకి వస్తున్నాయనే విషయం తెలుస్తుంది.అందరూ విమానాల్లో బయలుదేరతారు.

ఒక వైపు గాలిలో యుద్ధాలు (ఈ మాదిరిలో ఉంటుంది - http://www.youtube.com/watch?v=C2rp4AowBYc), ఇంకొ వైపు హీరొయిన్ తప్పించుకొని ఆ నగరంలో మనుషులతో ఎదో మాట్లాడుతూ,కొంత మంది తనని వెంటపడుతూ, ఇంకొ వైపు కమాండర్ దీర్ఘాలోచనలో ఉంటాడు.

కథ కంచికొస్తూంది.

ఇంతలో యుద్ధ విమానలన్నీ యుద్ధానికి వెళ్తే, హీరో, తన పైలట్ రూటు మారుస్తారు. ఏం జరుగుతూందని ఆరా తీస్తే అయిర్ చీఫ్ మార్షల్ అణుబాంబుతో వాళ్ళని పంపించారన్న విషయం తెలుస్తుంది.

హీరో ప్రయాణమంతా హీరోయిన్ ఫోటో చూస్తూ ఉంటాడు. నిశబ్దంగా మారిపోతుంది, అటు హీరోయిన్ పడిలేస్తూ పరిగెడుతూ ఉంటుంది, అడుగు చప్పుళ్ళు మాత్రమే స్టీరియోలో వినిపిస్తూ ఉంటాయి, విద్యాసాగర్ కి ఉత్కంఠగా ఉంది, సంతుకి కూడా ఎదో అవుతుందని అనిపిస్తూంది.

హీరోయిను ఒక మనిషి కొట్టేసి తన సెల్ఫోన్ తీస్కుకొని పారిపోతుంది. కమాండర్ ఓపిక పట్టలేక హీరో పర్సనల్ నంబరుకి ఫోను చేస్తాడు. మాస్కో నగరానికి దగ్గరలో ఉంటాడు. హీరోకి కాలు వస్తుంది, ఎత్తితే హీరొయిను మాట్లాడుతుంది, నన్ను కిడ్నాప్ చేసారన్న విషయం నీకు చెప్పలేదా అని ఎడుస్తుంది

హీరొ మాస్కో దగ్గరకి వచ్చేసాడు, ముందు సీటులో ఉన్న హీరో ఫ్రెండు, కౌంట్ డౌన్ లెక్కెడతాడు

హీరో నుండి మాట రావట్లేదు…

‘ఎలా ఉన్నావు’ అంటాడు…
‘నన్ను కాపాడు’ అని హీరొయిన్ అంటుంది…
‘ఎక్కడ ఉన్నావూ..

కౌంటు డౌన్ అయిదు కి వస్తుంది

‘ఎమో ’ అని ఇటు అటు చూసి… ‘ఎదో అర్థమయినట్టు’
‘ఆ అది…’

కౌంట్డౌన్ ఒకటి

‘మాస్కో’ అంటుంది

హీరో రియాక్ట్ అయ్యే లోపు బటన్ నొక్కేసాడు స్నేహితుడు
సినిమా అంతా స్లో మోషన్లోకి వెల్లిపోతుంది, వయలిన్లు మెల్లగా మ్రోగుతున్నాయి… అణుబాంబు పేలడానికి రెండు నిముషాలుందని చెబుతాడు, ప్లేను వెనక్కి తిరుగుతుంది.

హీరోయిన్ అలాగే రోడ్డు పక్కన కూర్చుని ఎకాంతంగా ఉంటుంది
‘బాబు జాగ్రత్తండీ’

హీరో నోటి మాట రాదు

‘ఎమండీ ఉన్నారా ?’
‘నీకొకటి చెప్పాలి’
‘ఏంటది’
‘సారీ… నేను మిలిటరీలో జాయిన్ అవుతున్నానన్న సంగతి ఆ రోజు చెప్పలేదు’
‘పర్వలేదు, నా కోసం వస్తారు కదా’, అని ఎడుస్తూ నవ్వుతుంది
‘వస్తాను ఇప్పుడే వస్తాను’
అని ప్లేనులో నుండి ఎజెక్టు బటన్ నొక్కి ఎగిరిపోతాడు

ఇంకో పది సెకండ్లు…
అణు బాంబు మాస్కోలో పడి కిందున్న హీరొయిన్ పైనున్న హీరో ఇద్దరూ ఆవిరయిపోతారు… వాల్ల పిల్లాడు ఇంట్లో ఏడుస్తూ ఉంటాడు, సినిమా అయిపోయింది


ఏడవ అధ్యాయం : రిజల్టు

అందరూ తిట్టుకుంటూ బయటికి వెళ్తున్నారు

సంతుగాడు అన్నాడు “అన్న బాంబుని పట్టుకుంటాడనుకున్నా, సచ్చిపోడమేంటెహె”

విద్యాసాగర్ ఇంకా ఆ భీభత్సకాండ నుండి బయటికి రాలేదు, కంటతడి అలానే మిగిలి ఉంది….


సినిమా నెల బాగా ఆడింది, తర్వాత ఎవడూ పట్టించుకోలేదు. కానీ ఆ సంవత్సరాంతంకి ఫారిన్ ఆస్కరులో పోటీ పడి గెలుచుకుంది.

సేనాపతి కి తిరుగులేదన్నారు. గణేష్రావ్ ని ప్రపంచమంతా గుర్తించింది, కానీ తన తర్వాత సినిమా కూడా పోయింది, అందులో కూడా బెమ్మనందాన్ని పెట్టలేదు మరి.

విద్యాసాగరు ఏ సినిమా కొత్తగా అనిపించక చూడటం ఆపేసాడు, అసలుకే ఒక సారి సినిమా కోసం పరీక్ష పోగొట్టుకున్నాడనే ఫీలింగు కూడా ఉండిపోయింది.ఏరోనాటిక్స్ లోకి వేల్డామని కృషి చేస్తున్నడు.

సంతుగాడు ఫ్యాన్ క్లబ్బు వాళ్ళ రాజకీయ పార్టీ లో కార్యకర్తగా వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాడు.

-----------------------


Wednesday 26 May 2010

ఇంటర్-మే-ఈడియట్

ప్రపంచంలో ప్రతీ వాడికీ తెలిసీ తెలియని వయసు అని ఒకటి ఉంటుంది. అప్పుడే అన్నీ సమకూర్చెస్తే తెలిసిన వయసులో కావలసినవన్నీ రాబట్టచ్చు అని పెద్దలు శకుని మామ రేంజ్ లో ప్లానులు వేస్తూ ఉంటారు. దానిని పసిగట్టారు గనుకనే తెలుగునాడులో ఇంటర్మీడియెట్ కళాశాలలకి కుంభవృష్టి లాగా లాభాలు వచ్చి పడ్డాయి. ఆ లాభాల బాటలో ఇటుకలేసిన ఒక కార్మికుడు గణేష్ !

చీమ పంచదార పాకం నాకడానికీ, దోమ మనిషి రక్తం తాగడానికీ, బ్లాక్ టిక్కెట్లు అమ్మే వాడు ఊరి చివరిన భూమి కొనడానికీ ఎలా ఆశిస్తాడో... ఇలాంటి సాధారణ చదువికుడు కూడా ఒక పెద్ద కాలేజీకి వెళ్ళడానికి అంతే ఆశిస్తాడనేది వాడికి తప్ప ఎవరికీ తెలియని రహస్యం ! అయితే వాడి పరీక్ష ముందు రోజు పక్కింటి సరోజాదేవి ఆంటీ ఎలాగైనా తన కొడుకు హరీష్ కి గణేష్ కంటే మంచి ర్యాంకు రావాలని భగవద్గీతా పారాయణం చేసింది. దానికి ముందు రోజు జ్యోతిష్యుణ్ణి పిలిపించి వెయ్యి రూపాయిలు ఇప్పించి మరీ తన కొడుకుకి మంచి ర్యాంకు వస్తుందని చెప్పించుకుంది.

ఏదేమైతేనేం సివరాకరికి వెలువడ్డాయి AIEEE ఫలితాలు. నిజానికి దానికి గంట ముందే న్యూస్ చానళ్ళలో చైతన్యా నారాయణా కాలేజీలు కీచురాళ్ళల్లాగా రాంకుల పారాయణం చెసాయి. అది చూసిన ఉద్వేగంలో, గణేష్ కి మంచి రాంకు రాకపోతే తనకి గుండెపోటు వస్తుందేమో అని భయపడ్డాడు వాళ్ళ నాన్న ! మొత్తానికి ఇంటర్నెట్టులో తన నంబరు ఇచ్చి...లోడు అవుతున్న పావుగంట సమయంలో విష్ణు సహస్రనామం చదివించారు ఇంట్లో వాళ్ళు.


ర్యాంకు వచ్చింది..

"గణేష్ పీ.
మీ ర్యాంకు...1001.... ప్రింట్ తీస్కోవాలనుకుంటే ఇక్కడ క్లిక్ చెయ్యండి !... "
అంతే రాసి ఉంది !

గణేష్ కి ఎమీ అనిపించట్లేదు...
"1001 మంచి ర్యాంకు నాన్నా !"

"అయ్యో..."

"ఎమైంది నాన్నా ?"

"సహస్రనామం చదివించడం వల్ల 1001 వచ్చింది ! అష్టోత్రం చదివించి ఉంటే 9 వద్దును !"

"అయ్యో !"

"ఇప్పుడు ఎమైంది నాన్నా ?"

"అసలు ఏమీ చదివించి ఉండకపోతే 1 వద్దును కదా"

లక్కీగా ఆ రోజు మద్యాహ్నం వంటలో ఉప్పు కారం తగ్గించి బీ.పీ.మాత్రల పొడిని అమ్మ వేసింది కాబట్టి సరిపోయింది, లేకపోతే గుండెపోటు గుమ్మడి లాగా గుండె పట్టుకుని ఉండేవారు గణేష్ నాన్న.
అయితే సరోజాదేవి ఆంటీ మాత్రం ఒక్కడు సినిమాలో బురదపూసుకున్న ప్రకాష్ రాజ్ లాగా ఎవరితోనూ మాట్లాడట్లేదు. ఎందుకు అని అడిగితే 'మౌనవ్రతం పాటిస్తున్నా' అని చెప్తోందంట !
రోజులు గడుస్తున్నాయి. కౌన్సిల్లింగ్ రోజులు దగ్గర పడుతున్నాయి.

గణేష్ రాత్రి టీవీ 9 చూస్తున్నాడు. నాన్న ఆఫీసు నుండి వచ్చాడు

"ఏం చేస్తున్నావురా గణేష్"

"వార్తలు చూస్తున్నా నాన్నా. లోక జ్ఞానం తెలుసుకుంటున్నా"

"మా బాబే.. బాగా చూడు"

నిజానికి అలా రోజూ రాత్రి ఎంటర్టైన్మెంట్ టునైట్ కోసం వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నాడు...అయితే ఇంతలో

ఫ్లాష్ న్యూస్ : "పద్ధెనిమిదేళ్ళ బాలునిపై తల్లి హత్యా ప్రయత్నం......విశాఖపట్నంలోని సీతమ్మపేటలో సరోజా దేవి అనే మహిళ...."
ఇంకా పూర్తిగా అవకుండానే కెవ్వుమని కేకపెట్టాడు గణేష్. పక్కింట్లోకి తొంగి చూస్తే అంతా హడావిడి. అసలు కథ ఏమిటనేది టీవీ 9 వాడికి కూడా అంతు చిక్కలేదు... అయితే ఆ రోజు పొద్దున్న సరోజా దేవి హరీష్ని నూతిలోకి తోసేసి తను కూడా దూకేసే ప్రయత్నం చేస్తూంటే ఎదురింటి శివబ్రహ్మం గారు చూసి పైకి లాగి పబ్లిసిటీ కోసం టీవీ 9 వాడిని పిలిపించారు... చావుబ్రతుకుల్లో ఉన్న ఇద్దరినీ టీవీ 9 వాళ్ళు "ఇప్పుడు మీరు ఎలా ఫీలవుతున్నారు" అని ప్రశ్నించగా... సరోజా దేవి లాగి పెట్టి కొట్టడంతో.... అది ఇంకా పెద్ద న్యూస్ అయ్యి 108 వాళ్ళు వచ్చి ఇద్దరినీ తీసుకొని వెళ్ళారు.

పక్కింటి స్పేరు తాళాలు వాళ్ళింట్లో ఉన్నాయని గుర్తొచ్చి గణేష్, హరీష్ ఇంట్లోకి వెళ్ళాడు. తన హాల్టికెట్టు నంబరు దొరికింది, వెళ్ళి హరీష్ ర్యాంకు నెట్టు లో చూసాడు. ..... 1002 ! అప్పుడర్థమయ్యింది..... ఆ అవమానం భరించలేక నూతిలోకి దూకి ఆత్మహత్య ప్రయత్నం ఎందుకు చేసారో

"సరేలే ఊరుకో... పరేషాన్ ఎందుకు" అని సర్ది చెబుదామని బ్రహ్మానందంలా ఆసుపత్రికి బయలుదేరాడు.

సరోజాదేవి ఆంటీ ఐ.సీ.యూ. లో ఉంది. హరీష్ కోలుకున్నాడు. బయట ఎన్ టీవీ వాడు "మీరు టీవీ 9 వాడిని చెప్పుతో కొట్టారా చేత్తో కొట్టారా" అని అడగడానికి, సరోజాదేవి ఎప్పుడు లేస్తుందా అని ఎదురు చూస్తున్నారు. హరీష్ రూముకి వెళ్ళాడు గణేష్.

"ఎలా ఉన్నావు హరీష్... ఎడారిలో ఎండిపోయిన కాకిలా అయిపోయావు తెలుసా", నోరు జారాడు గణేష్

"ఎందుకొచ్చవ్ ?", చేతిలో ఉన్న ఆపిల్ పండు లాక్కుంటూ అడిగాదు హరీష్

"ఊరికే.....ఇంతకీ కౌన్సిలింగుకి ఎలా వెల్తావు మరి ?"

"వచ్చే వారం కదా కౌన్సిలింగు అప్పటికి బాగానే ఉంటుంది... నాది జింబాడీలే పర్లేదు"

"నీ రాంకు చూసాను రా. సారీ రా, కానీ ఒక్క రాంకు తేడాయే కదరా దానికోసమే ఇలా..."

"రాంకు ఎదైతేనేమి లేరా... ఓటమి ఓటమేరా"

"ఇద్దరికీ ఒకే బ్రాంచు వస్తుందిలేరా ఎవ్వరూ ఓడరు"

"రాదురా... నీకేముంది రిజర్వేషన్లో మంచి సీటు వస్తుంది"

'అదీ నిజమే' అనుకున్నాడు. అయినా ఈ మాత్రం దానికే.....గణేష్ అనుకున్నాడు...
ఎంత జింబాడీ అయినా మనసులో చింత ఉన్నంతవరకూ విందుభోజనం పెట్టినా తిన్న తిండి సరిగ్గా అరగదు...

వారం గడిచింది....

కౌన్సెలింగ్ అయిపోయింది.... సరోజాదేవి స్పృహలో నుండి బయటకు వచ్చింది.... ఇంక ఈ న్యూస్ లో పసలేదని ఎన్.టీవీ వాళ్ళు కూడా పట్టించుకోవదం మానేసారు. తను ఒక్క ర్యాంకు కోసం ఇలాంటి పనికిరాని పని ఎందుకు చేసిందని కుమిలి కుమిలి ఏడిచింది. బ్రతికించినందుకు దేవునికీ డాక్టరుకీ కొబ్బరికాయ కొట్టింది !

హరీష్, గణేష్ ఇద్దరూ ఆసుపత్రికి వచ్చారూ.
"అమ్మా నాకు మెకానికల్ వచ్చింది"

సరోజా దేవి భోరున ఎడ్చింది...
"ఎంత పని చేసానురా నిన్ను నూతిలోకి తోసేసి"

"ఇప్పుడు అందరూ కోలుకున్నారు కదా అదే పదివేలు", అంది గణేష్ అమ్మ

"అమ్మా గణేష్ కి కూడా సేం బ్రాంచ్... రిజర్వేషన్ కోటా వాడుకోలేదు"

"అదేంటి బాబూ..."

"హరీష్ కోసం కాదాంటీ.... మా ఫైనాన్షియల్ స్టేటస్ బాగానే ఉంది... అందుకే నాకు రిజర్వేషన్ తీసుకోవడం అవసరం అనిపించలేదు !!!! "

ఇంతకీ వీడు మంచి వాడంటారా వెర్రి వాడంటారా ?

Wednesday 31 March 2010

పెళ్ళి @ 1 paisa...


(special thanks to Guru Charan)


-----------------

ముందుమాట : ఈ కథ ఎవరి జీవితాన్ని inspire అయ్యి రాసింది కాదు. ఒక ఇరవై సినిమాలు పది పుస్తకాలూ పది orkut threadలు చదివితే వచ్చిన ఇంగిత జ్ఞానం నుండి రాయబడినది !


అలాగే ఇందులో SMS పర్వం అంతా ఇంగ్లీష్లో రాయబడినది ఎందుకంటే SMSలు రాసేది తెలుగులో కాదు గనుక...

-----------------------

"రెయ్ లేరా... లే...", అమ్మ తట్టి వెళ్ళిపోయింది...

"ఇంకో అయిదు నిముషాలు" అనుకున్నాడు ప్రకాష్ మనసులో

"trrrrringggggg"

"ఉలిక్కి పడ్డాడు ప్రకాష్"... అందుకే తనకి ఆ అలారం గడియారం అంటే చాలా ఇష్టం !

"కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే.... ఉత్థిష్ట నరశార్దూలా కర్తవ్యం దైవమాహ్నికం..."

'ఇది ఏం స్వరమో గానీ రోజూ రోజు ఇలా మొదలవుతుందా... ఇంత అద్భుతంగా మొదలవుతుందా !!! '

అనుకుంటూ టూత్పేస్ట్ చూసాడు

"అమ్మా పేస్ట్ అయిపోయింది ?"

"ఈ రోజుకి పిండుకొ..."

పాల వాడు వచ్చాడు... నాన్న పాలు తీసుకుంటున్నాడు
"ఏంటి అబ్బాయి పొద్దున్నే లేచాడు"

ప్రకాష్ కి ఒళ్ళు మండింది, పాల వాడికి కూడా లోకువ అయిపోయాడు

నాన్న మాత్రం తెగ సంబరపడిపోతున్నాడు

"మా వాడికి ఈ రోజు పెళ్ళి చూపులు"

"ఔనాండీ....అమ్మాయిది రాజుమండ్రేనాండీ ?"
"కాదు పిఠాపురం వాళ్ళు... బీటెక్కు ఫస్టు క్లాసులో పాసయ్యింది"
"అయితే రేపటి నుండీ ఇంకో లీటరు పాలు ఎగస్ట్రా తేవాలా"

ప్రకాష్ ఇంక రెయాక్ట్ అవ్వకపోతే ఈ విషయం ఊరంతా పాకెస్తుందనిపించింది, పక్కనే ఉన్న ఈనాడు పేపర్ తీసాడు
"మ్యాచు ఆడకుండానే గెలుపు ఖరారు చేసిన పాంటింగ్...
ఏంటిది, గ్రౌండ్లోకి రాకుండానే ఎలా అంటారు అసలు వీళ్ళు.. కాస్తయిన బుద్ధుండక్కర్లే !"

పాల వాడు మారుమాట్లాడకుండా వెళ్ళిపోయాదు...

నాన్నకి కోపం వచ్చింది !
"పెళ్ళి చూపుల్లో ఇలా దొంకతిరుగుడు మాటలు మాట్లాడకు, చంపెస్తా"

--------------------

పొద్దున్నే ఏదింటికి పొలాల మధ్యలో నుండి వెళ్తూ ఇంకా ఆ తడి ఆరని మంచులో పచ్చని పొలాలు, అరటితోటలు, కొబ్బరితోటలూ వాటిమీద తెల్లని మంచు, మధ్యమధ్యలో ఎర్రబస్సులూ...మధ్యమధ్యలో గుళ్ళు... కాలువలు, వాటిని కలిపే గోదావరి వంతెనలు... నిజంగా కోనసీమకి తిరుగులేదేమో... మొత్తానికి పిఠాపురంలోనికి వచ్చారు

"అబ్బ రాజమండ్రిలో ఉండిపోయి కోనసీమ రావడమే మర్చిపోయాం....వెళ్ళేటప్పుడు ఒక సారి పెద్దన్నయ్య ఇంటికి వెళ్దాం గుర్తు చెయ్యి !..."


"బాబూ బండి లెఫ్టుకి తీసుకో, ఆ అరుగు కనిపిస్తూంది కద అక్కడ ఆపు" !

ప్రకాష్ కళ్ళు వెతుకుతున్నాయి.... అమ్మయి ఫొటోలో చాలా అందంగా ఉంది...

తల్లి తండ్రి బాగానే మట్లాడుతున్నారు... ఊరిలో మంచి పేరు ఉందని కూడా వినికిడి
"రండి కూర్చోండి, దారి కంఫ్యూజ్ అవుతారేమో అనుకున్నాను"

ఇలా కొంత సేపు కబుర్లు... ఒకరిద్దరు పిల్లలు అక్కడే తిరుగుతున్నారు, పక్కింటివాళ్ళు...టిఫిన్ కి ఇడ్లీ తెచ్చారు

"ఈ రోజు అమ్మాయివే వంటలన్నీ"

"రుచి బ్రహ్మాండంగా ఉంది !"
ప్రకాష్ కి తెగ నచ్చేసింది, ఆగలేకపోతున్నాడు కానీ బయటకి ఆ ఆతృత చూపిస్తే బాగోదు అని ఊరుకుంటున్నాడు...

"నేను చూపించక పోతే సరే వీళ్ళైనా అర్థం చేస్కొలేరా !!!"

"అమ్మాయిని పిలవమంటారా ?"

"అర్థం చేస్కున్నారు"

సినిమాలో చూపించినట్టు స్లో మోషన్లో తలదించుకొని పళ్ళెం పట్టుకొని వస్తుందని చూసాదు...
కాని మమూలుగానే వచ్చింది, వచ్చి ఎదురుగా కూర్చుంది కొంచెం ఆ 'ఊహించని పరిణామం' నుండి తేరుకోని చూసాడు... పట్టపగలే చందమామని చూసినట్టుంది తనకు !!! తను అందరినీ పలకరిస్తూంది...

"నమస్తే నా పేరు ప్రవీణ"
ఇంకా తేరుకోలేదు ప్రకష్, పరధ్యానంలోకి వెళ్ళిపోయాదు... నాన్న వెనకనుండి గిల్లాడు !

"నా పేరు ప్రకాష్ "

ప్రవీణ తన అమ్మ చెవిలో ఎదో చెప్పింది... అమ్మ కొంచెం విసుగ్గ మళ్ళీ ఎదో చెప్పింది....ప్రకష్ కి ఎదో అనిపించింది
"ఎమైన ఇబ్బందుందా ?"

ప్రవీణ కరుగ్గ చెప్పింది
"మీతో కొంచెం వేరే గా మాట్లాడదామని...."

-----------

"చదువుకున్న వాళ్ళు కదా వాళ్ళకీ వాళ్ళకీ అన్నీ తెలుస్తాయి లెండి"
సర్ది చెప్పాడు ప్రకాష్ నాన్న !

ఇద్దరూ వసార్లోకి వెళ్ళిపోయారు.... ఒక నుయ్య, చిన్న తోట, ఒక స్టోరు హౌస్, వాటికి మధ్యలో పేద్ద అరుగు.... అక్కడ ఇళ్ళే వేరు..


మేడ మెట్ల మీద కూర్చున్నారు...

ముందు తనే మొదలేట్టింది

"ఎమైనా మంచి నీళ్ళు తీసుకుంటారా?"

"లేదు... మీ వంట చాలా బాగుంది"


"థాంక్స్... కానీ మీరు చాల పొట్టిగా ఉన్నారు నాకు ఇప్పటికి అయితే అంత నచ్చలేదు"

చిన్న నవ్వు నవ్వాడు, topicకి వచ్చాడు
"ఇంతకీ మీరు ఏంటి చదువుకున్నారు ?"

"మీకు చెప్పలేదా ?"


"చెప్పారు... బీటెక్ మెకానికల్"

"తెలిసి ఎందుకు అడీగారు ?"

ప్రకాష్కి మండింది ! ఏదో మాటా మాటా పెరిగి అడిగితే బాగుంటుంది అనుకున్నాడు కానీ ఏంటిది !

"మీరు ఇలాగ అడుగుతారని తెలియక అడిగాను....ఇంతకీ ఒక వేళ పెళ్ళి కుదిరాక ఉద్యోగం చేస్తారా ?"

"అలగేం లేదే... ఉద్యోగాలు మేమే మానెయ్యాలా ? మీరు మానెయ్యకూడదా ?"


"నా ఉర్దేశం అది కాదు... థీరీలు మాట్లాడుకుంటే, ఇంటి పనులు మగవాళ్ళకన్నా ఆడవాళ్ళె బాగా చూసుకోగలరు, సూక్ష్మంగా ఆలొచించగలరు...."

"మనసుంటే మార్గం ఉంటుంది ఫ్రకష్ గారు... ఆ సంకల్పం ముందు ఈ థీరీలు ఎంత ?"


"ఆ సంకల్పం లేని పక్షం గురించి నేను మాట్లాడుతున్నాను....కావాలంటే నేను పని మానెస్తాను, కాని నిన్ను బాగ చూసుకోవడం నా బాధ్యత అని అనుకుంటాను"

మనిషికి తలపగలగొట్టినా ఊరుకుంటాడు కానీ అహం మీద కొడితే ఊరుకోడు... కాని అహాన్ని పక్కనపెట్టి ఆలోచిస్తే సమస్య వేరుగా కనిపిస్తుంది....అదే ప్రకాష్ చేసింది


"నన్ను బాగా చూసుకోవాలనుకుంటే నన్ను నన్నుగా వదిలెయ్యండి... నా నుండి నేను యే సమాధానం ఇవ్వలేను, మీరు నన్ను అర్థంచేసుకుంటారని అనుకుంటున్నా"

------------------------


"భోజనం చాలా బగుంది... యేరా నచ్చిందా ?"

ప్రకాష్ ప్రవీణా కేసి చూసాడు. కళ్ళల్లో కొండంత నిరాశ కనిపిస్తూంది...
"కొద్దిగ ఉప్పెక్కువయ్యింది ఆంటీ"

-----------------------

"మీకు రెండు రోజుల్లో ఏ విషయం అనేది చెబుతాం"


రోజు గడిచింది.... ప్రకాష్ మళ్ళీ హైదరాబాద్ వెళ్ళిపోవడానికి బాగ్గు సర్దుకుంటున్నాడు

"ఏంట్రా ఖాయం చెయ్యమంటావా ?"

'నా వైపు నుండి నేను కలిసిపోయే ఉండే ప్రయత్నం చేసినా తను అలా ఉండట్లేదు అంటే ముందు ముందు ఇబ్బంది అవుతుందెమో....ఎంతైనా తను నేను ఒకటి కాదు కదా, ఎప్పుడు ఎలా ఉంటుందో నాకు మాత్రం ఎలా తెలుస్తుందీ

వద్దని చెప్పెద్దామనుకున్నాడు..


'tring tring tring tring SMS.'... అని ఒక SMS వచ్చింది..ప్రకాష్ చదువుతున్నాడు

"pelli choopulante interview kaadu... pellam post ante office kaadu !"

ప్రకాష్లో మళ్ళీ ఉత్సాహం వచ్చింది...
"నాన్నా రేపు చెప్తను లే"

-----------------------------------------------------------------------------------

SMS పర్వం :

ప్రకాష్ reply ఇవ్వటం మొదలుపెట్టాడు... ప్రవీణా కూడా !
(Blue : prakash...
Maroon : Praveena)


-----------------------------------------------------------------------------------


(
"pelli choopulante interview kaadu... pellam post ante office kaadu !")

సినిమా డైలాగులు బాగా కొడుతుంది...

"meeku nenu bossla kanipiste aa tappu naadi kaadu meedi....meere ala anukuntunnaru"

"naa tappe aithe naa udyogam sangati meekenduku :x"

"bharyani pattinchukoni bhartaki pellenduku ?...
'premante iddari manasulu pellante iddaru manushulu'..aa rendu kudarali..
ee vishayam teliyakundane pelli choopulaki oppukunnara ? :-/ "


నాకూ సినిమా డైలాగులొచ్చు హ్హహ్హహ్హా...

"ayinaa naaku ee pelli choopulu meeda antha nammakam ledu..."

"lenappudu mari nannu enduku pelli choopulaki pilicharu ? ee vishyam akkada kooda enduku cheppaledu?"

"adigina vaallu meere samadhanam vetukkondi"

ఇదేం ట్విస్టు

":O"

";-)"

"hmmm....intlo amma nannalante bhayama ?"

"amma nannalaki kodukule bhayapadataru kooturlu kaadu.... "

అబ్బో మరేంటి నన్ను చూడటానికే ఒప్పుకుందా ?

"aaduvaari maatalaku arthale verule .. ;-)"

"ayina adi na personal.."


ఎదో దాస్తూంది..

"personal antaru.. vetukko antaru.. chepte tidataru... ayina ippudu SMS enduku chesinattu :o"

"cheptaanu...meeru nakoka maata iste cheptanu"

మళ్ళీ ఫిట్టింగ్..

"ento cheppandi ivvadamo lekapovadamo tarvatha chooddam !"

"nenu meetho maa intlo matladina sangati evarikee cheppakoodadu"

"cheppanu... ayina tappu meedi siksha naaka ? :("

"ala anukovaddu....naaku manushulante antha naccharu naa kosam antoo evaroo undaru ani anubhavaalu cheppayi...:(.. anduke naaku pelli kooda ishtam ledu"


'నన్ను పెళ్ళి చేసుకో నీకు నేనుంటా.... 'వద్దులే చెప్తే advantage తీస్కున్నా అంటుంది..

"meeru inkokati telusukovali... manam enthiste antha teesukuntaam !... adi aanandamaina prema ayina daanam ayina edaina... karma siddhantam marchipoyara ?"

"anni sarlu adi vartinchadu...konni sarlu icchina daniki phalitam raadu kooda"

"poortiga manishini nammatam, poortiga manushulani nammakapovatam rendoo moorkhatvale...konchem practicalga matladukundama ! :-/"

హహ ఈ పంచు డైలాగుకి చచ్చింది గొర్రె...


చాలాసేపటి వరకు SMSలు రాలేదు...


"emayyindi balance ayipoyinda ?"

మళ్ళీ చాలా సేపటికి ప్రవీణ SMS చేసింది ...

"ledu...aalochanalo undipoya..."

"em aalochistunnaru ?"

"gadichipoyina gataanni.... baagucheyyaalsina bhavishyattuni !"


నాకే గనుక నీ మీద సినిమా పాట రాసే ఛాన్సు ఇస్తే...
"త్రివిక్రం శ్రీనివాస్ కూతురివా...
జంధ్యాల ఆత్మకి మాటలివా...
పరుచూరి వదిలిన పంచులివా...." ....అని రాసెస్తా !


"ippudu nenu ee pelliki oppukovala vadda ?"

"mee ishtam adi"


లింకు దొరికింది... రివర్సు గేరు పడాల్సిందే..

"aithe pelliki oppukonu lendi don't worry...;-)"

"enduku ? naatho emaina problemaa"

"aunu...aa problem ento cheppanu, malli tittukuntaru"

"vaddu vaddu cheppandi nene maaruta"

హమ్మయ్య... Einstien E=mc^2 కనుక్కోడానికి ఎంత కష్టపడ్డాడొ ఇప్పుడర్థమయ్యింది... నీ మనసులో మాటని చెప్పించాక..

"mottaniki digocchaaru... nijaniki meetho problem emi ledu"

"em ledaa...ala abaddhaalu adevallante naaku nacchadu"

నాకూ అంతే...

"marem cheymataru ? pelli choopulu ishtam ledu antaru...pelli vaddante oppukoru !"

"nenu mee ishtaniki vadilesanani munde cheppanu... :-/"

"aba chaa.... meeru naa angeekaaraanni aasistunnaru !"

"adem kaadu"


ఎంత మొహమాటమో...పల్లేటూరి ఆడపడుచుకి..

"meeru inko mettu digalsinde"

"ippude ila unte pellayyaka full dominate chestaremo"

"pellayyaakanaa....oppeskunnaru gaaa!!.. :-D"

"inkaa ledu....ayinaa meeru bottiga amayakulu..."

అవును ..... నువ్వు మాయ చేసాక నాలో మిగిలేది అమాయకత్వమే !

"endukala anipinchindi ? :o"

"gatam gurinchi okka mukka kooda adagaledu"


"hmm..... mallee pelli choopulu modalayyayi !"

":-)"

"mee gatamlo em jariguntundi love failure aa"

"meeku assalu siggu ledu, pelli choopula topiclo love stories gurtu chestara ?"

"inkaa bahuvachanam enduku ekavachanam loki vacchey"

"neeku assalu siggu ledu :-D"

"siggu padalsindi ammayilu....;-)"

"abbo...
prema kathalani lite teeskogalanu kanee naaku konni aims unnayi naaku daani poorthi support dorukutundani nammakam ledu"


"pellante interview kaadu madam...;-)"

"ilaa ayithe nenu matladanu..:x"

హ్హ హ్హ హ్హ... నువ్వు చెబితే కరెక్టు నెనంటే తప్పు.... లెచింది మహిళా లోకం...

"sorry sorry please nenu joke vesanu anthe... neeku support kavaste nenu udyogam kooda manesi inti panulu chestanu !...:-("

"........."

"??"

"antha daaka vaddule kaani... ee matram hamee icchi mundu pelli fix chesey tarvatha sangati tarvatha...:)"

యాహూ...

"
♪ ♪ ipude kottaga vintunnattuga sarada teeraga oo antanu ga...... ....:-D"

":-) happy married life......"

--------------------


ఈ టైటిల్ ఎందుకు అలా ఉందో ఈ పాటికి తెలిసే ఉంటుంది... ఇద్దరికీ మెసేజ్ ఆఫర్ ఉంది...

---------------

Tuesday 16 February 2010

కింగ్ కోడి - The hen with the Muscle !

క్కొ.. క్కొ.. క్కొ.. క్కోక్కొ.. కొ. క్కొ.. క్కొ..

అవును లెండి మీ మనుషులకి మా భాష ఇలాగే ఉంటుంది. ఎప్పుడైనా మనసు పెట్టి కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తే కదా తెలిసేది, మాది క్కొ..క్కొ.. భాష కాదు కలల భాష అని.

నా పేరు కోడి మల్లన్న. మాది పాడేరు. ఆల్లూరి సీతారామ రాజు పుట్టిన అడవిలో పుట్టిన నాటు కోడిని. అల్లూరి వీరత్వాన్ని మా బామ్మ కోడి అచ్చమ్మ ఇరవై నాలుగ్గంటలూ చెబుతూ ఉండేది. అందుకే నాకు తెల్ల దొరల్లన్నా తెల్ల కొంగలన్నా చిరాకు. ఒక సారి మా ఊరిలోకి తెల్ల దొర ఒకడు వచ్చాడు వచ్చి నా ఫొతో తీసుకోడానికి దగ్గరకి వచ్చాడు.
"జాయ్ సీతారామ రాజు " అని వాడి మీదకి దుంకాను, వాడు వెనక్కి పరిగెడితే వాడి ఎలాస్టిక్కు నిక్కరు లాగేసాను.
నా ఆనందానికి అవధుల్లేవు, ఒక తెల్ల దొరని బట్టల్లేకుండా నడి రోడ్డు మీద పరిగెట్టించాను. క్క క్క క్క కా....

ఆ రోజు మా ఊరిలో నాకు పాడేరు పందెం కోడి అని బిరుదు ఇచ్చారు.

నాకు ఉండే పని ఈ ప్రపంచం మొత్తంలో ఎవరికీ ఉండదు. సంవత్సరం మొత్తం బొక్కటమే నా పని. వెయ్యించిన జీడిపప్పు నా దైనిక ఆహారం. అప్పుడప్పుడు నా కోసం నా యజమాని వీరన్న పస్తులుంటాడు. కానీ నాకు జీడిపప్పు మాత్రం పెట్టకుండా ఉండడు. నేను పెంచుతున్న కండ మా పడేరులో అతి పెద్ద చికెన్ షాపు అయిన దుర్గమ్మ చికెన్ సెంటర్లో కూడా దొరకదు. ఇప్పటిదాకా నన్ను ఓడించడానికి నర్సీపట్నం, రాజుపాలెం, ముత్యాలమ్మపాలెం, సబ్బవరం, కొత్త వలస, ఎస్.కోట, రాజాం నుండి పందెం కోళ్ళు వచ్చి ఒడిపొయాయి. నా తల మూడు లక్షలు పలుకుతుంది. ఆ డబ్బు కోసం మీరు సాఫ్టువేరు కంపనీలలో ఎన్ని గంటలు పనిచేస్తారో... క్క క్క క్క... మిమ్మల్ని చూస్తే జాలేస్తుంది !

నా పెళ్ళాం పేరు కోడి దమయంతి. నెను రోజు రోజుకీ బేవార్సుగా ఆడకోడులతో ఎక్కువ తిరుగుతున్నానని మా ఊరొళ్ళు నాకు దమయంతికి ఇచ్చి పెళ్ళి చేసారు. దమయంతి భలే చలాకీగా ఉంటుంది గుక్క ఆపకుండా పావుగంట సేపు పాట పాడగలదు. అందుకే దానికి పొద్దున్నే అందరినీ లేపే పని అప్పజెప్పారు ! నాకు ఎంత బలమో దమయంతికి అంత ఓపిక, తూ-చ తప్పకుండా రెండు రోజులకి ఒక గుడ్డు పెట్టెస్తుంది.

నా శత్రువు కోడి పెదబాబు. పెదబాబు బాబు కోడి కనకయ్య నా తండ్రి కోడి కృష్ణుడుని సంక్రాంతి రోజు చంపేసాడు. నా అమ్మ అదే రోజు నన్ను కనింది, "కృష్ణుడు మళ్ళీ పుట్టాడు రా" అని మా కుటుంబమంతా, శోక సముద్రం నుండి అమృతం వచ్చినట్టు, నన్ను చూసి సంబరం చేసుకున్నారు.

కోడి పెదబాబుని రెండు మూడు సార్లు కలిసాను, వాడి కళ్ళు పొగరుగా ఉంటాయి, వాడి రెక్కలు నా కన్నా రంగుగా ఉంటాయి. అయితేనేంటి, రక్కలు కాదు బొక్కలు ముఖ్యం. ఒక సారి పోటీ కూడా జరిగింది మా ఇద్దరికీ, కానీ ఆ పొటీలో పెదబాబు పీకని చికెన్ సెంటరుకి అమ్మకానికి పెట్టెద్దామనుకున్నా. మధ్యలో ఎవడో ' పోలిసులు పోలిసులు ' అని అరిస్తే పీక నరికెద్దామని కాలు ఎత్తబోయేలోపు నన్ను మా యజమాని లాక్కెళ్ళిపోయాడు. దొరుకుతావు పెదబాబు ఎదో ఒక రోజు దొరుకుతావు.

నిజానికి పెదబాబు నాన్న కనకయ్య అని నాకు చాలా లేటుగా తెలిసింది. కనకయ్య ఇప్పుడు సివరాఖరి జీవితం గడుపుతున్నాదు.

మా అమ్మ కోడి దురగమ్మ ఈ విషయం లేటుగా చెప్పింది, చెప్పిన కొద్ది రోజులకి పాము కాటు వల్ల చనిపోయింది. దుర్గమ్మ నా ప్రాణం లాంటిది, నేను పుట్టిన మొదటి క్షణం దుర్గమ్మ ఒదిలో నుండే వచ్చాను. అమ్మ పోయాక నాకు చివరి చూపులు కూడా దక్కలేదు. నేను మర్చిపోలేని రోజు అది, దమయంతి గుడ్డు పెట్టని ఏకైక రోజు అది. కోళ్ళకే గనుక ఒక స్వర్గం అంటూ ఉంతే దుర్గమ్మ కి రాజ వైభోగం ఇవ్వమని దెవుణ్ణి ప్రార్థించాను.


ఇంకొక వారంలో సంక్రాంతి.
ఈ సంక్రాంతికి పెదబాబుని చంపితే వాడి నాన్న కనకయ్య కుళ్ళి కుళ్ళి ఏడవటం నా పగని చల్లారుస్తుంది.

వీరయ్య కొడుకు రాంబాబు కరాటే నేర్చుకుంటున్నాడు. ఒక సారి నా దగ్గరకు వచ్చి కోడి కరాటే నేర్పించాడు, ఖాతాలూ, బ్లాక్లూ, కిక్క్లూ ఇలా కరాటేలో వివిధ విన్యాసాలు భలే నేర్పించాడు. నేను రెక్కలతో గాల్లో ఎగిరి flying కిక్కు చేసాను. అది చూసి రాంబాబు కూడా ఎగిరి జారి పడ్డాడు, వాడి చెయ్యి విరిగింది. వీరయ్య నా దగ్గరకి వచ్చి , నేను గానీ గెలవకపొతే జీడిపప్పు పెట్టడం మానెస్తా అని బెదిరించాడు.

"మనుషులు డబ్బు కోసం బ్రతుకుతారు, భక్తులు దేవుని కోసం బ్రతుకుతారు, నేను పగ తీర్చుకోవడం కోసం బ్రతుకుతాను" అని చెబుదామనుకున్నా. కానీ క్కొ క్కొ తప్ప ఏమైనా వినిపిస్తే కదా, "కళ్ళల్లోకి చూసి మాట్లాడు వీరయ్యా...friendly గా ఉండు !"

సంక్రాంతి రోజు రానే వచ్చింది, అందరూ చుట్టాలని పలకరించుకుంటూ, విందు భోజనాలు చేస్తూ, ఆటలు, పాటలు, గొబ్బెమ్మలూ, ముగ్గులు వేస్తున్న పదహారణాల ఆడపిల్లల బుగ్గల్లో సిగ్గులు... అబ్బా ఎంత చూడముచ్చటగా ఉందో ఆ రోజు.

దమయంతి నా రెక్కలు దువ్వుతూంది, నేను బయలుదేరడానికి సిద్ధంగా ఉన్నాను..

"సరే ఆ పెదబాబు పీక కోసి వస్తా"
"నేనూ వస్తాను"
"వద్దు.....రక్తపాతం నువ్వు కళ్ళ జూడలేవు"

రణరంగం సిద్ధమయ్యింది

"చుట్టుపక్కల అన్ని ఊర్లలో ఎదురు లేని సైనికుడిగా ఎదిగి, అల్లూరి పౌరుషాన్ని పునికిపుచ్చుకుని, ఈ ఏజెన్సీ లోనే తిరుగులేని రారాజుగా ఉన్న పడేరు పందెం కోడి మల్లన్న." అన్న వెంటనే రంగంలోకి దింపారు. అందరూ ఈలలు, గోలలు. దగ్గరకి ఎవరైనా వస్తే వాడి మొహం రక్కేసే ఆవేశంలో ఉన్నాను. అది గమనిస్తున్న వీరయ్య మళ్ళి కోర్టు కేసులు ఎందుకులే అని అందరినీ దూరంగా ఉంచుతున్నాడు (అప్పుదెప్పుదో బాలకృష్ణ ఇలాగే ఒక కోడి కోసం కోర్టుకు వెళ్ళాడని మా బామ్మ చెప్పింది లెండి).

పెదబాబు కనిపిస్తున్నాడు దూరంలో. నాకు నా నాన్న చావు గుర్తొస్తూంది. రక్తం ఉడికిపోతూంది, ఇంకొంత సేపు ఉంటే చికెన్ ఫ్రై అయిపోతానేమో అనేలా ఉడుకుతూంది. పెదబాబుకి కూడా ఎవో బిరుదులు చెబుతున్నారు, నాకేమీ వినిపించట్లేదు. పెదబాబు రంగంలోకి దిగాడు.

పెదబాబు కళ్ళని గమనిస్తున్నా. ముందు వాడే ఎగిరాడు. నా ముక్కుకి చిన్న గాటు పడింది. తర్వాత నేను ఎగిరాను, వాడు కూడా ఎగిరదు, వాడి కత్తి నా కత్తి తగిలి ఇద్దరం దూరంగా పడ్డాము. మా వాళ్ళు మా ఇద్దరినీ పట్టుకొని దగ్గరగా పెట్టారు. ఈలాగ పావుగంట సాగింది, ఇద్దరం సగం ఓపిక కోల్పోయాం.
అప్పుడు మా వీరన్న నాకు తేనెలో ముంచిన జీడిపప్పు తినిపించాడు. నా కళ్ళల్లో శక్తి ప్రవహించింది. రాంబాబు నేర్పించిన కోడి కరాటే పెదబాబు మీద ప్రయోగించాను. ఎగిరెగిరి తన్నాను. వాడి కాలు కోసాను. క్క క్క క్క క్క కా.. మల్లన్న మల్లన్న అని జనాలు అరుపులు... నా కళ్ళల్లొ ఆనందం చూడాలి ! (సాగర సంగమం లో కమల హాసన్ చివర్లో ఇలాగే ఏడ్చాడు లెండి !)

ఇంక సివరాకరి కోడి కరాటే మూవ్... పెదబాబు ఇంక లేవలేకపోతున్నాడు. సైకిల్ కిక్కు ఇవ్వడానికి కాలు దువ్వాను, పెదబాబు గట్టిగా అరిచాడు....

"ఒరేయ్ నీ అమ్మని చంపింది పాము కాదురా వీరన్న రా...నీ అమ్మని వండుకొని తినేసారు రా క్క క్క క్క కా"....

ఎదో బాంబు పేలినట్టు అనిపించిండి

అది విని నా కిక్కు సగంలోనే ఆగిపోయింది. అంతా నిశబ్దం.
వీరన్న కేసి చూసాను, చేతిలో జీడిపప్పు ఉంది.


నాకు మాట రావట్లేదు, ఏడుపు కూడ రావత్లేదు, నా శత్రువు ఎవరో నాకు గోచరించట్లేదు. శిలలాగ ఒక నిముషం ఉండిపోయా


'ఎంత మోసం చెసావు వీరన్న, ఇంత కాలం నన్ను మేపుతూంది నీ డబ్బుల కోసమా నా పని అయిపోతే వండుకొని తినేస్తావా...అన్యాయంగా నా అమ్మని చంపేసావు కద రా...


పెదబాబు పుంజుకొనేలా ఉన్నాడు. వీరన్న కళ్ళల్లో తొందర కొట్టొచ్చినట్టు కనిపించింది. అది చూసి కోడి మల్లన్నకి వైరాగ్యపు ఆనందం వేసింది.

నీకు శిక్ష వెయ్యాలి వీరన్న... నువ్వు కుమిలి కుమిలి ఏడ్చే శిక్ష వెయ్యాలి... ఔను నేను ఓడిపోవాలి !... ఓడిప్......'

ఇంక మాటల్లేవు... కోడి మల్లన్నని కోడి పెదబాబు చంపేసింది ..ఆ రాత్రికి కోడి పెదబాబు గాయాలతో చనిపోయాడు, కోడి కనకయ్య కూడా కొడుకు చనిపోయాడనే బాధతో చనిపోయారు.

వీరస్వర్గం పొందిన కోడి మల్లన్నని వండకుండా వీరయ్య సమాధి చేసి పాతిపెట్టాడు.

పాడేరు పందెం కోడి ఒక ఊతపదంగా మారిపోయింది.


Wednesday 3 February 2010

లల్లీ - అమెరికా - ప్రేమ

ముందు మాట :
ఇది మునుపటి కథల కంటే పెద్ద కథ . అందువలన దీనికి interval పెట్టి రెండు భాగాలుగా చెయ్యబడింది.
school పిల్లల తత్వాన్ని చూపించటం ఈ కథలో మొదటి భాగం ముఖ్య ఉర్దేశం.


తొందర తొందరగా చదివెద్దాం అనే ఉర్దెశం ఉంటే మరి కొంచెం సమయం తీసుకోండి.


-----------


జ్ఞానోదయ పబ్లిక్ స్కూల్ లో మద్యాహ్నం పావుతక్కువ పన్నెండు దాటింది. 9th B విద్యార్థులు టిఫిన్ బాక్స్ లు ఓపెన్ చెయ్యడానికి ఎదురు చూస్తున్నారు. హిందీ టీచర్ మాత్రం ఆవిడ పాఠంలో లీనమై ఉంది...


""काल करे सो आज कर"
""काल करे सो आज कर"

పిల్లలు పద్యాన్ని అప్పజెబుతున్నారు

"आज करे सो अब"
"आज करे सो अब"


చందూ గాడు టిఫిన్ బాక్స్ తీసాడు. ఒక మూతలో అప్పడాలు ఉన్నాయి, మూత తీసి చూసాడు, సాంబారన్నం ఉంది. చందూ గాడికి నోరు ఆగట్లేదు. పక్కన ఉన్న దినేష్ గాడు బాక్స్ మీద చెయ్యి వేసాడు, చందుగాడు చెయ్యి పట్టుకున్నాడు. ఇద్దరూ కొట్టుకుంటున్నారు


""काल करे सो आज कर"
""काल करे सो आज कर"


"ఎవడురా కారేజీ ఓపెన్ చేసింది ?"

దినేష్, చందూ ఒక్క సారి నిఠారుగా కూర్చున్నారు.

"ఎవడైనా తింటున్నట్టు కనిపిస్తే మూతి వాయించేస్తా"


"आज करे सो अब"
"आज करे सो अब"

ఇంతలో చందూని వెనక నుండి ఎవరో తట్టారు. చందూ వెనక్కి తిరిగాడు, తట్టింది లలిత. చందూ గాడి మొహం వెలిగిపోయింది. వాడికి లలితంటే చాలా ఇష్టం. వాడి భాషలో అది 'ప్రేమ'
లలిత ఏదో చీటీ ఇచ్చింది. "ఇది సుమిత్రకి పాస్ చెయ్యవా !". చందూ గాడు నవ్వుతు తీసుకున్నాడు.


టీచర్ : "చందూ sit straight"


చందూ ముందుకు తిరిగాడు. దినేష్ గాడు ఆ చీటీ తీస్కున్నాడు.

చందూ : "ఒరేయ్ లలిత సుమిత్రకి ఇమ్మంది"
దినేష్ ఓపెన్ చెయ్యబోయాడు, చందుగాడు అడ్డుకున్నాడు
దినేష్ : "ఏముంది ఇందులో"
చందూ : "ఏమో.. పక్కోళ్ళ చీటీలు చూడకూడదు"
దినేష్ : "ఎ పోరా..."

అని ఓపెన్ చేసాడు.. ఏవో పిచ్చి symbols ఉన్నాయి...

లలిత దినేష్ ని కొట్టింది : "సుమిత్రకి ఇవ్వురా.."
దినేష్ : "ఏంటిది కోతుల బాష"


ఆ జోకుకి చందూ, లలిత శబ్దం బయటికి రాకుండా నవ్వుకున్నారు


లలిత : "కోతి భాష కాదు... కొత్త లాంగ్వేజ్ మేము పెట్టుకున్నాం"
చందూ : "అయితే మాకు నేర్పించు"


టీచర్ : "దినేష్ అండ్ చందూ.stand up on the bench"


ఇద్దరూ అమాయకంగా మొహం పెట్టారు.బెంచ్ మీద నిలబడ్డారు.
దినేష్ : "లలిత నాకు కూడా నేర్పించు"
లలిత : "ష్..."

దినేష్ సుమిత్రకి పేపర్ విసిరేసాడు. అందులో ఏముందో వాళ్ళకే తెలియాలి. ఇంకో 5 ని||లులో గంట మోగింది.

--------------


"అరేయ్ చందుగాడు అప్పడాలు తెచ్చాడు"..గుంపులో ఎవడో అరిచాడు

చందుగాడు టిఫిన్ బాక్స్ పట్టుకొని పరిగెత్తాడు. వాడి వెంట ఇంకో ఇద్దరు పరిగెత్తారు. దినేష్ గాడు ఆ ఇద్దరిలో ఒకడిని పట్టుకున్నాడు, రెండో వాడి నుండి చందూ గాడు పారిపోయాడు.
చందూ, దినేష్ ఆ గ్రౌండ్లో మిగితా వాళ్లకి దూరంగా తిన్నారు.


దినేష్ : "అరేయ్ నీకొక secret చెప్తా "
చందూ :"ఏంటి ?"
దినేష్ : "నాకొక అప్పడం ఇవ్వు"
చందూ : "ముందు secret చెప్పు బే"
దినేష్ : "గాడ్ ప్రామిస్ నేను secret కచ్చితంగా చెప్తాను"
చందూ గాడు అప్పడం ఇచ్చాడు
దినేష్ : "ఎవరికీ చెప్పద్దు"
చందూ : "చెప్పను"
దినేష్ : "మన క్లాసులో లలితని ఒకడు లవ్ చేస్తున్నాడు"
చందూ గాడి గుండె ఆగినంత పనయ్యింది.


'ఈ విషయం వీడికెలా తెలిసింది క్లాసులో నేను లలిత కేసి చూడటం చూసేసాడా'


"ఎవడాడు ?"

దినేష్ : "వాడి పేరు h తో end అవుతుంది D తో start అవుతుంది"

చందూ గాడు క్లాస్మేట్స్ గురించి ఆలోచిస్తున్నాడు. నలభై మంది ఉన్నారు రోల్ నెంబర్ కూడా గుర్తులేదు.

'దీపక్ కాదు, ధనంజయ్ కాదు ఇంకెవరూ'

దినేష్ గాడు బాక్స్ సర్దుకొని వెళ్ళిపోతున్నాడు

చందూ : "ఒరేయ్ దినేష్ ఎవడురా"
దినేష్ : "నీ యబ్బ ఇప్పుడే చెప్పావ్ కదా" అని పరిగెత్తాడు

చందూ గాడు ఒక్క సారి ‘ఆహ్’ అని నోటి మీద చెయ్యి వేసుకున్నాడు. వాడి ఫ్రెండే వాడికి కాంపిటీషన్ ఆ అనుకున్నాడు.
ఇంతకీ తను లవ్ చేస్తూందో లేదో అనే టెన్షన్. సన్నని గోడ మీద నడుస్తున్నట్టు ఉంది తనకి.

--------------------------------------------------------------------------


సాయంత్రం పీ.టీ. క్లాసు. అందరూ క్రికెట్ ఆడుతున్నారు.


చందూ గాడి టీం లాస్ట్ బాల్ సిక్స్ కొట్టాలనీ తను అది సాధించాలని కలలు కంటూ ఫీల్డింగు చేస్తున్నాడు. ఎందుకంటే పక్కనే లలిత థ్రో బాల్ ఆడుతూంది !


ఎట్టకేలకు తన బాట్టింగ్ వచ్చింది.

దినేష్ గాడు బౌలింగ్, లాస్ట్ బాల్ రెండు పరుగులు తీయాలి. అందరూ ఆసక్తిగా చోస్తున్నారు. దినేష్ని ఓడిస్తే తన లవ్ సక్సెస్ అని అనుకున్నాడు. దినేష్ బౌలింగ్ చాలా స్పీడ్ వస్తుంది. చందూ బాల్ ని పూర్తిగా చూడకుండా గట్టిగా కొట్టాడు. మొతానికి సింగిల్ తీసి డ్రా ఐంది.


Next period కి క్లాసు లో కూర్చున్నారు. లలిత చందూని తట్టి

“బా ఆడావ్ తెల్సా. నాకు చాలా టెన్షన్ వేసింది. అసలకే దినేష్ బౌలింగ్ కదా !”

ముందు చందు గాల్లో తేలాడు. మళ్లీ దినేష్ పేరు విని దిగొచ్చాడు . కొంపదీసి దినేష్ ని లవ్ చేస్తూండ అని డౌట్ వచ్చింది !


లవ్ చేయకుండా కూడా మనుషులు బ్రతగ్గలరనే విషయాన్ని వాళ్లెప్పుడో మర్చిపోయారనుకుంట, సినిమా ప్రభావం అంటే ఇదే !

------------------------------------------------------------------------


ఇంతలో బయట కారిడార్లో ఏదో గొడవ అవుతూంది. వెళ్లి చూసాడు. దినేష్ గాడు సుదీప్ గాడు కొట్టుకుంటున్నారు. సుదీప్ ని మెట్ల మీదకి గట్టిగా తోసేసాడు. హీరో అయిపోతున్నాడని చాలా ఫీల్ అయిపోయాడు చందూ.


“Teacher is coming , teacher is coming”…


అర సెకండ్లో ఆ కారిడార్ ఖాళీ అయిపొయింది. దినేష్, చందూ గాడు కూర్చున్నారు. డెస్క్ లో స్కూల్ బాగ్ నుండి ఒక పేపర్ తీసి చింపి చేతి మీద పడిన చిన్న దెబ్బ తుడుచుకున్తున్నాడు దినేష్.

“ఎరా దినేష్ ఏమైంది ?”, ముందు బెంచ్ సుమిత్ర అడిగింది.

“ఏం లేదు నాది చింపిరి జుట్టు అంట, అందుకే కొట్టాను”. దినేష్ కి ముందు నుండి సుదీప్ తో గొడవే.

-----------------------------------------------------------------


లాస్ట్ పీరియడ్ అయిపొయింది. అందరూ స్కూల్ బస్సు ఎక్కారు. దినేష్, చందూ,రాజేష్ క్రికెట్ కార్డ్లు ఆడుకుంటున్నారు. చందుకి ఆ రోజు చాలా వింత రోజు. అనుకోని ఒక పెద్ద రహస్యం బయట పడింది. గొడవ జరిగింది, లలిత తనని పొగిడింది .. ఆ ఆలోచనలో ఉన్నాడు.

“అరేయ్ ఇంకో secret చెప్పనా ?”, దినేష్ మళ్లీ కెలికాడు

“చెప్పు”,

“ఈ రోజు సుదీప్ ని ఎందుక్కోట్టానో తెలుసా”

“నీ జుట్టు బాగోలేదన్నాని?”


“కాదు గ్రౌండ్లో వాడు లలితకి flying kiss ఇచ్చాడు”

చందూ గాడు షాక్ అయ్యాడు. సుదీప్ గాడంటే కోపం వచ్చింది. కానీ తన రహస్యం బయట పడిపోతుందని భయమేసి ఇంకేం మాట్లాడకుండా ‘హా’ అన్నాడు.రాజేష్ గాడు పైకి చూసాడు.


“ఏంటి లలిత గురించి చెప్పాడా ?”

"నీక్కూడా తెలుసా ?"

“ఇప్పటికీ పది మందికి చెప్పాడు ఎవరికీ చెప్పొద్దని !”


దినేష్ గాడి సిగ్గుకు అంతులేదు..


‘flying kissలు, affair లు వామ్మో'




Final exams వచ్చేసాయి. సగం టైం అంతా లలితే గుర్తొస్తూంది. ఇంకో వైపు చదవాలి కూడా. ప్రతీ పరీక్ష అయ్యాక లలిత కోసం చూస్తూ ఉంటాడు. తను అలాగే సుమిత్రతో కలిసి వెళ్ళిపోతుంది. అప్పుడప్పుడు దినేష్ గాడు లలితతో ఓ తెగ మాట్లాడతాడు. చాల జెలసీ కలిగేది చందుకి !

రాత్రి పడుకునేటప్పుడు తనూ, లలితా ఏదో ఉద్యానవనంలో విహారం చేస్తున్నట్టు పగటి కలలు కంటాడు.

తెలుగు exam నాడు లలితా చందు అమ్మలక్కల కబుర్లు చెప్పుకున్నారు. మాటల్లో తనకి ఇంగ్లీష్ workbook లో చివరి లెసను రాస్తే చాక్లెట్ ఇస్తానని చెప్పాడు. డబ్బులు అడిగితే ఇవ్వరని అమ్మ పర్సులో నుండి పది రూపాయిలు కొట్టేసాడు. మళ్ళీ ఎప్పుడూ అలా చెయ్యనని ఒట్టేస్కున్నాడు కూడా.


------------------------------


intermission


------------------------------



చివరిది ఎకానామిక్స్ exam, తనకి ఇష్టమైన సబ్జెక్టు. ఆ రోజు రోల్ నెంబర్ సీటింగ్ మార్చారు. సరిగ్గా తన పక్క బెంచ్లో లలిత ఉంది. చందు తెగ సంబరపడిపోయాడు.


పరీక్ష start అయ్యింది. తానో పెద్ద సినిమా హీరో అనే కాన్ఫిడెన్సు తో exam రాసేస్తున్నాడు. ఆ పేపర్లో పడిపోయి గంట అయింది, 75% పేపర్ అయిపొయింది. అకస్మాత్తుగా తలెత్తాడు. పక్కన లలిత తల వాల్చి పడుకొని ఉంది ! పేపర్ కట్టేసి పక్కన పెట్టేసి ఉంది.


టీచర్ తన వెనక ఉండటం చూసి లలితని ఎరేసేర్ తో కొట్టాడు. లలిత తన కేసి చూసింది. ఇక అంటా సైగలే.


“ఏం అయింది ?”

“ఏం రాదు”


వెనక టీచర్ కేసి చూసాడు. టీచర్ తనని చూడట్లేదు. లలిత బెంచ్ మీద తన పేపర్ పెట్టేసాడు.

మల్లి సైగలు

“వద్దు వద్దు”

“నో ప్రాబ్లం నీ పేపర్ కింద నా పేపర్ పెట్టు ఎం అవ్వదు”

“మరి ఇవ్వటం ఎలాగా”

“నేను తీస్కుంటా don’t worry”


నిజానికి తను ఎప్పుడు కాపీయే కొట్టలేదు


లలిత ఇంకో గంట సేపు బాగా రాసేసింది. టీచర్ చూడకపోవడం చూసి చందు మెరుపు వేగంతో బెంచ్ మీద తన పేపర్ని లాగేస్కున్నాడు. ఇంకో అరగంట సేపు ముక్కు నోరు చెవి సైగలతో కాపీ చేస్కున్నారు !



పరీక్ష అయిపొయింది.

లలిత చందు దగ్గరకి వచ్చింది, చందు నవ్వుతున్నాడు. లలిత నీరసంగా ఉంది.

“నిన్నంతా 104 జ్వరం. నాకు ఎకనామిక్స్ అస్సలు రాదు. నువ్వు చాలా హెల్ప్ చేసావు తెల్సా. లేకపోతే ఫెయిల్ అయిపోదును”. అంటూ ఎడిచేసింది

ఆ క్షణం తను హీరో అయిపోయడనే ఫీలింగ్ లేదు, లలితకి జ్వరం వచ్చిందనే మాట తర్వాత తనకి ఏమి వినిపించలేదు !

చందు తన జేబులో నుండి మంచ్ తీసి లలితకి ఇచ్చాడు. లలిత ఏడుస్తూ నవ్వింది.


“థాంక్యూ చందు. హ్యాపీ సమ్మర్ హాలిడేస్. ఎక్కడికైనా వెళ్తున్నావా ?”


‘నువ్వు లేని హాలిడేస్ ఎలా గడుస్తాయో ఏంటో !’


“అవును లలిత తిరుపతి వెళ్తున్నాము. నువ్వు అన్నీ బాగా పాస్ అవ్వాలని దేవునికి చెప్తానులే ”

---------------


చందుకి సమ్మర్ ఎలా గడిచిందంటే. ఆఖరికి తిరుపతి దర్శనంలో కూడా ఆ లైన్ లో లలిత ఉంటుందేమో అని వెతుక్కున్నాడు !


---------------

స్కూలు మళ్ళీ మొదలయ్యింది. అందరూ కొత్తగా కలిసారు. క్లాసు టీచర్ మారింది. తెలుగు మాస్టర్ క్లాసు కి వచ్చి అందరికీ మొదటి రోజు కదా class లేదని ఏదో ఒకటి చేసుకోమన్నారు.

“అరేయ్ చందు, లలిత ఏదిర ?”

దినేష్ కూడా అదే టెన్షన్ లో ఉన్నాడు... చందు లాగ

“నాకేం తెలుసు ?”

ఇంతలో సుమిత్ర వాళ్ళకేసి తిరిగింది

“హే ఈ రోజు ఐదుగురు కొత్త స్టూడెంట్స్ వచ్చారు”

“మన వాళ్ళు కూడా చాలా మంది వెళ్ళిపోయారు, రమేష్, వీణ, లలిత”

“రమేష్ వీణ రేపు వస్తారు.


లలిత వాళ్ళ నాన్నకి అమెరికా ట్రాన్స్ఫరు అయిపొయింది తను కూడా చక్కా అమెరికా వెళ్ళిపోయింది !”


ఇంకంతా నిశబ్దం.... చందు మనసులో !



పదహారు ఏళ్ళు పోయాక తానా సభ, US లో, anchor మాట్లాడుతున్నాడు.

“ఒక సారి మా అమెరికా ఫ్రెండ్ తో - తెలుగు వాళ్ళ మీద నీ opinion ఏంటి - అని అడిగాను. వాడు ఇలా చెప్పాడు, తెలుగు వాళ్ళు మంది ఎక్కువ మేటర్ కొంచెం తక్కువ అని. నాకు చాలా కోపం వచ్చింది. నువ్వు పొరబడుతున్నావు, తెలుగు వాళ్ళకి తెలివి అమోఘం, మిగితా వాళ్ళతో పోలిస్తే ప్రాచూర్యం తక్కువ అని అన్నాను. తను ఇలా అన్నాడు, తమిళం వాళ్ళు చాలా పెద్ద పెద్ద అవార్డులు రివార్డులు పొందారు తెలుగు వాళ్ళకి అవి తక్కువ అని.


ఆ మరుసటి రోజు తనకి పేపర్ తెరచి చూపించాను. తన మాట తప్పు అని నిరూపించిన ఒక తెలుగు యువకుని విజయం అది. నేను మాట్లాడుతున్నది దేని గురించో మీకు తెలిసే ఉంటుంది. నోబెల్ ప్రైజ్ విన్నర్ చంద్రశేఖర్ గురించి


చంద్ర శేఖర్ అలియాస్ చందు స్టేజి ఎక్కి చక్కటి చిక్కటి ఉపన్యాసం ఇచ్చాడు.


అందరూ విందు చేస్తున్నారు. తనతో చాలా మంది మాట్లాడుతున్నారు. తన వయసు 30 అవడంతో పెళ్లి విషయాలు చాలా మంది ఆరా తీస్తున్నారు.

సంబారు వేస్కోడానికి వెళ్ళాడు. గరిటె తీస్కోబోతూంటే ఇంకొక చెయ్యి కూడా వచ్చింది.

“మీరేస్కోంది”, అన్నాడు చందు

“సరే”

చందు మోహంలో తేడా వచ్చింది. ఆమె లలిత.


‘లలిత….. బాగున్నావా…… ఎం చేస్తున్నావ్ ? ఎలా ఉన్నావ్ ? నీ కోసమే నేను ఇంత దూరం వచ్చి ఇంత పేరు తెచ్చుకున్నది ! నీకొకటి తెలుసా.. నువ్వేమీ మారలేదు.. అవే కళ్ళు అదే అందం. నువ్వు చీరలో ఎంత బాగున్నావో... నన్ను ఒక్క క్షణం గుర్తు పట్టచ్చు కదా... నీకు పెళ్లయిపోయిందా పరవాలేదులే స్నేహితుడిలా అయినా నిన్ను చూసుకుంటా. ఒక్క సారి నన్ను గుర్తుపట్టు. ఏంటి నీకు ఆ పాత రోజులు గుర్తులేవా !'


తను సంబారు వేస్కుంది, వేసుకొని వెళ్ళిపోయింది. వెళ్లి దూరంగా కూర్చుంది.


అంతా విలాసవంతమైన గదిలో కూడా తనకి ఎక్కడా సంతోషం కానరాలేదు.


‘లలితకి అసలు నేను గుర్తున్నానో లేదో !’


తను కూడా కొద్దిగా దూరంలో కూర్చున్నాడు. సినీనటుడు బ్రహ్మానందం తన దగ్గరకి వచ్చాడు నోబెల్ ప్రైజ్ కి కంగ్రాట్స్ చెప్పాడు, చందుని పరధ్యానంలో ఉండటం చూసి నవ్వుతూ మాట్లాడకుండా వెళ్ళిపోయాడు. ఇప్పుడు లలిత కుర్చీ తిప్పుకొని కూర్చుంది. ధైర్యం చేస్కొని చందు దగ్గరకి వెళ్ళాడు,

“ఇక్కడ కూర్చోవచ్చా ?”


లలిత ఏడుస్తూంది


“ఏమైంది మీకు ?”


“నీతో మాట్లాడాలంటే భయమేస్తూంది”, అని తొందర తొందరగా బాగ్ లో నుండి మంచ్ తీసి ఇచ్చింది.


“లలితా నేనింకా గుర్తున్నానా !”


తను ఇంకా గట్టిగ ఏడిచింది..

"ఇది ఏడుపు కాదులే ఆనందభాష్పాలు అయినా మర్చిపోతే కదా మళ్లీ గుర్తు రావటానికి !”, అంది కళ్ళు తుడుచుకుంటూ.


చందు ఎం మాట్లాడలేదు


నీకు పెళ్లి కాలేదు కదా నన్ను పెళ్లి చేస్కో”,అని ఆ ఏడుపు గొంతుతో ఏదో ఆర్డర్ వేసినట్టు అక్కడ నుండి లేచి వెళ్ళిపోయింది !


తను భ్రమలో ఉన్నాడేమో అని ఒక సారి గిల్లుకున్నాడు. ఇంకా నమ్మకం కుదరక దగ్గరలో ఆడుకుంటున్న పిల్లాడి దగ్గర బంతి లాక్కున్నాడు. ఆ పిల్లాడు ఎడ్చాడు. ఇప్పుడు నమ్మకం కుదిరింది.


చంద్ర శేఖర్ కి నోబెల్ ప్రైజ్ వచ్చినప్పుడు కూడా అంత ఆనందం వెయ్యలేదు !